నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను.. ఇక నా వల్ల కాదు: దువ్వాడ శ్రీనివాస్

నా భార్యను ఎంతో బాగా చూసుకున్నాను, కానీ ఆమె రాజకీయ కాంక్షతో ఎంతో వేధించింది. నా తల్లిని కూడా ఇంట్లోకూడా రానీయలేదు.

నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను.. ఇక నా వల్ల కాదు: దువ్వాడ శ్రీనివాస్

Updated On : August 10, 2024 / 1:47 PM IST

Duvvada Srinivas Press Meet: తన భార్య వాణిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియా సమాశంలో మాట్లాడుతూ.. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినా, తనపై వాణి 24 గంటలూ విషం చిమ్మిందని వెల్లడించారు. రాజకీయ కాంక్షతోనే తనను వేధించిందని ఆరోపించారు. తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిందని, ఆమెతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన భార్య వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఆరోపించారు. తన ప్రాణానికి ఏం జరిగినా అచ్చెన్నాయుడిదే బాధ్యత అన్నారు.

తన రాజకీయ జీవితాన్ని వాణి నాశనం చేసిందని, ఆమె అహంకారి అని దుయ్యబట్టారు. తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే చస్తానని వాణి బెదిరించిందని వెల్లడించారు. ”నా భార్యతో అనుక్షణం నరకం అనుభవించాను. నా కుటుంబమే నన్ను ప్రశ్నిస్తోంది. నా పాతికేళ్ల కష్టాన్ని వదులుకుని 100 మెట్లు దిగి నా భార్యేకే టిక్కెట్ ఎనౌన్స్ చేశాను. అయితే అధిష్టానం నన్నే పోటీ చేయమనడంతో పార్టీ కోసం పనిచేశాను. కానీ నా భార్యే వ్యతిరేకంగా పనిచేసింది. నన్ను ఓడించడానికి టీడీపీతో చేతులు కలిపింది. నా భార్యను ఎంతో బాగా చూసుకున్నాను, కానీ ఆమె రాజకీయ కాంక్షతో ఎంతో వేధించింది. నా తల్లిని కూడా ఇంట్లోకూడా రానీయలేదు. వ్యాపారంలో వచ్చిన డబ్బును వాణి చేతుల్లోనే పెట్టాను. తనకే అన్ని కావాలన్న అహంకారంతోనే ఇదంతా చేసింది.

Also Read : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్‌ కుటుంబ వ్యవహారంలో మ‌రో ట్విస్ట్..

దువ్వాడ వాణినే.. దివ్వల మాధురిని పార్టీలోకి తెచ్చింది. నాపై రాజకీయంగా వాడటానికి మాధురిని తెచ్చింది. ఆమెకు, నాకు లేని పోని సంబంధాలు సృష్టించింది. మాధురితో నాకు సంబందం ఉందని.. ప్రచారం చేసి ఎమ్మెల్యే సీటు కోట్టేయాలని ప్రయత్నించింది. దీంతో మాధురి మనసు గాయపడి ఆమె ఆత్మహత్య చేసుకోబోతే నేను కాపాడాను. అందరినీ కోల్పోయిన మాధురికి నేను ఉన్నానని భరోసా ఇచ్చి దగ్గరయ్యాను. ఆమెకు అండగా ఉండాలనుకున్నా.

నేను ఎన్నికల్లో ఓడిపోయా, ఆస్తులు ఇచ్చా.. ఇంకెందుకు వాణి రచ్చ చేస్తుంది? రెండేళ్లుగా పట్టించుకోని నా భార్యకు ఇప్పుడే నేను గుర్తు వచ్చానా? నా భార్యతో డైవర్స్ తీసుకుంటా. నా కూతుళ్లకి అన్యాయం చేయను. ఏం కావాలన్నా ఇస్తా.. నేను ఉంటున్న క్యాంప్ ఆఫీస్ తప్ప అన్ని రాసిస్తా. క్యాంప్ ఆఫీస్ కూడా నా పిల్లలకే అని వీలునామా రాస్తా. మాధురికి మంచి ఆస్తులున్నాయి.. నన్ను బ్లాక్‌మెయిల్‌ చేయాల్సిన అవసరం ఏముంద ”ని దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు.