డెంగీ జ్వరంతో భార్య చనిపోయింది: బాధతో కూతురిని చంపి భర్త ఉరేసుకున్నాడు

  • Published By: vamsi ,Published On : October 25, 2019 / 01:34 AM IST
డెంగీ జ్వరంతో భార్య చనిపోయింది: బాధతో కూతురిని చంపి భర్త ఉరేసుకున్నాడు

Updated On : October 25, 2019 / 1:34 AM IST

తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు డెంగీ జ్వరం విజృంభిస్తుంది. ఓవైపు కోర్టులు అధికారులకు చీవాట్లు పెడుతున్నా కూడా మరణాలు మాత్రం ఆగట్లేదు. ఇదిలా ఉంటే డెంగీ జ్వరంతో భార్య చనిపోగా భార్య లేదనే వేదనతో నాలుగేళ్ల చిన్నారిని చంపి తండ్రి చనిపోయిన విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండపేట పట్టణంలో నాళం వారి వీధిలో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ వ్యాపారం చేసే బాదం చందనకుమార్‌(35)కు అయిదేళ్ల క్రితం కోమరాజు లంకకు చెందిన శ్రీనవ్యతో వివాహం అయ్యింది. 

అయితే అక్టోబర్ 5వ తేదీన చందనకుమార్‌ భార్య డెంగీ వ్యాధితో మృతిచెందింది. సొంత వ్యాపారంతో ఆర్థిక సమస్యలు లేకుండా అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో భార్య డెంగీ వ్యాధి కారణంగా తిరిగిరాని లోకాలకు చేరడంతో తట్టుకోలేకపోయాడు చందనకుమార్‌.  తాను ఎంతో ప్రేమించే భార్య లేకపోతే తానెందుకు బతకాలి అనే భావనతో కుమిలిపోయాడు. చివరకు తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే కూతురిని చంపేశాడు. 

తను చనిపోతే కూతురు అనాథ అవుతుందని. తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని, అటువంటి పరిస్థితి కూతురికి రాకూడదని ఆలోచనతో ముందుగా కూతురిని చంపేసి తర్వాత చందన కుమార్ ఉరేసుకుని చనిపోయాడు. ఇందుకు సంబంధించి సుదీర్ఘ లేఖ రాశారు చందనకుమార్. గురువారం కోరుకొండలో ఉంటున్న చందనకుమార్‌ చెల్లెలు లత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో తెలిసిన వ్యక్తిని ఇంటికి పంపించింది. తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. మంచంపై విగతజీవిగా చిన్నారి యోషిత ఉంది. ఉరేసుకుని వేలాడుతూ చందనకుమార్‌ కనిపించాడు.