విపక్ష వైసీపీ టార్గెట్‌గా కూటమి సరికొత్త ఎత్తులు.. సభకు రాకుండా జీతాలు ఎలా అంటూ..?

ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే జీతాల చెల్లింపు నిలుపుదల చేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

విపక్ష వైసీపీ టార్గెట్‌గా కూటమి సరికొత్త ఎత్తులు.. సభకు రాకుండా జీతాలు ఎలా అంటూ..?

Chintakayala Ayyanna Patrudu (Image Credit To Original Source)

Updated On : January 8, 2026 / 9:54 PM IST
  • ఎథిక్స్ కమిటీ భేటీలో వైసీపీ సభ్యుల తీరుపై చర్చ
  • ఎమ్మెల్యేల జీతాలు నిలిపివేసే అధికారం ఎవరికి ఉంది?
  • ఎలా నిలిపివేయొచ్చన్న అంశాలపై ఎథిక్స్ కమిటీ స్టడీ?

Andhra Pradesh Assembly: ఇష్యూ ఏదైనా..సందర్భం మరేదైనా వైసీపీ టార్గెట్‌గా బాణాలు ఎక్కుపెడుతూనే ఉంది కూటమి. మరోసారి అసెంబ్లీ సమావేశాలకు టైమ్ దగ్గరపడుతున్న వేళ..ఫ్యాన్ పార్టీ సభ్యుల తీరును చర్చకు పెడుతున్నారు కూటమి సర్కార్ పెద్దలు. 2024 ఎన్నికల్లో ఓడి..11 సీట్లకే పరిమితమైనప్పటి నుంచి అసెంబ్లీకి రావడం లేదు వైసీపీ సభ్యులు. బడ్జెట్ సెషన్ మొదటి రోజు సభకు అటెండ్‌ అయి ఆ తర్వాత అటువైపు చూడటం లేదు అపోజిషన్.

అయితే సభకు అటెండ్‌ కాకున్నా..అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్‌లో మాత్రం సంతకాలు చేస్తున్నారట వైసీపీ సభ్యులు. స‌భ‌కు రాకుండానే జీతభత్యాలు ఎలా తీసుకుంటారంటూ పదేపదే ప్రశ్నిస్తున్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అంతేకాదు లేటెస్ట్‌గా ఎథిక్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.

Also Read: ఆ ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారా?

వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జీతాలు, అలవెన్స్‌లు తీసుకుంటూ సభకు డుమ్మాకొట్టడంపై కూటమి నేతలు తప్పుపడుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల నైతికతను ప్రశ్నిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో సీరియస్ కామెంట్లు చేశారు. ఇప్పటికే ఒకసారి సమావేశమై చర్చించిన ఎథిక్స్ కమిటీ సభ్యులు లేటెస్ట్‌గా మరోసారి భేటీ అయి ఫ్యాన్ పార్టీ శాసనసభ్యుల తీరుపై డిస్కస్ చేశారట.

దొంగచాటుగా అటెండెన్స్?
వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం జగన్‌ తప్పిస్తే, మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు సభకు హాజరుకాకుండా జీతాలు తీసుకుంటున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ విషయమై అసెంబ్లీలోనే గతంలో మాట్లాడుతూ వైసీపీ సభ్యులు సభకు రాకుండా, దొంగచాటుగా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఆరోపించారు.

ఉద్యోగాలు చేయని ప్రభుత్వ అధికారులకు జీతాలు చెల్లిస్తామా? ఎవరైనా విధులకు హాజరు కాకపోతే జీతాలు ఆపేస్తాం కదా? మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు ఎలా తీసుకుంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గతంలో ప్రశ్నించారు. ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎథిక్స్ కమిటీకి ఆదేశించారు.

దీంతో వైసీపీ సభ్యుల సంతకాలను ఎథిక్స్ కమిటీ పరిశీలించిందని ప్రచారం జరుగుతోంది. మొత్తం పది మంది సభ్యుల్లో ఆరుగురు ఎమ్మెల్యేల తీరుపై చర్చించినట్లు చెబుతున్నారు. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి నివేదిక సమర్పిస్తారని అంటున్నారు. సభకు హాజరుకాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవచ్చా.? ఎమ్మెల్యేలకు జీతాలు నిలిపివేసే అధికారం ఉందా.? ఉంటే ఎవరికి ఉంది.? ఎలా నిలిపివేయొచ్చన్న అంశాలపై ఎథిక్స్ కమిటీ స్టడీ చేస్తోందట.

జీతాల చెల్లింపులను నిలిపేస్తే?
ఎథిక్స్ కమిటీ సిఫార్సులతో స్పీకర్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే జీతాల చెల్లింపులను నిలిపేస్తే రాజకీయ వివాదం చెలరేగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశ రాజకీయాల్లో అతిపెద్ద చర్చకు దారితీసే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే సభకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తామని కూటమి ప్రభుత్వం గతంలో హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి డుమ్మా కొడితే సభ్యుల సభ్యత్వం ఆటోమెటిక్‌గా రద్దు అవుతుందని నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రామని తెగేసి చెబుతున్న వైసీపీ..అనర్హత వేటు ఎలా వేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ఎథిక్స్ కమిటీ సమావేశంపైనా వైసీపీ నుంచి రియాక్షన్‌ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.