ఇదే పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది- సీఎం చంద్రబాబుకి జగన్ వార్నింగ్..

రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవాలి.

ఇదే పాలన కొనసాగితే ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుంది- సీఎం చంద్రబాబుకి జగన్ వార్నింగ్..

Updated On : October 23, 2024 / 6:16 PM IST

Ys Jagan Mohan Reddy : కడప జిల్లా బద్వేల్ లో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆ కుటుంబానికి సాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైసీపీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జగన్. ”శనివారం నాడు ఘటన జరిగితే ఎవరూ పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. జగన్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసిన తర్వాతే బాధిత కుటుంబానికి సాయం అందింది. జగన్ రావడానికి కాసేపు ముందు మాత్రమే వీళ్లకి సాయం అందింది. ఇవాళ ఒకటే అడుగుతున్నా.

రాష్ట్రంలో అఘాయిత్యాలు, అన్యాయాలు పెరిగిపోయాయి. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబుకి ఒకటే చెబుతున్నా. ఘటన జరిగిన వెంటనే ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదుంది. తమ పార్టీ నేతలు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే మాటను పక్కన పెట్టి.. ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేయాలని చంద్రబాబుకు చెబుతున్నారు.

బాలిక జెడ్పీ హైస్కూల్ లో టాపర్ గా నిలిచింది. అలాంటి నెంబర్ 1 స్టూడెంట్ పరిస్థితి ఈరోజు ఇంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవాలి. దుష్ట పాలనకు ఎండ్ కార్డ్ పలకాలని చంద్రబాబుకి వార్నింగ్ ఇస్తున్నా. ఇదే మాదిరిగా చంద్రబాబు పాలన కొనసాగితే.. ప్రజల్లో తీవ్రమైన తిరుగుబాటు వస్తుందని కచ్చితంగా చంద్రబాబుకి మళ్లీ మళ్లీ చెబుతున్నా” అని హెచ్చరించారు జగన్.

”వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఉండేది. ఫోన్ చేస్తే చాలు పోలీసులు వచ్చే వారు. దిశా యాప్ ద్వారా మహిళలకు భద్రత కల్పించాం. బాలిక కేసులో నిందితులను ప్రభుత్వం కాపాడాలని చూస్తోంది. బాధితులకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదు. నిందితుడికి ప్రభుత్వ పెద్దలతో సంబంధాలున్నాయి. ఏపీలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఏపీలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి” అని జగన్ మండిపడ్డారు.

”వైసీపీ ప్రభుత్వంలో ఏ అక్క చెల్లెమ్మకు ఎలాంటి సమస్య వచ్చినా, ఆపద వచ్చినా.. మేము ఉన్నాము అని ప్రభుత్వం భరోసా ఇచ్చేది. దిశ యాప్ ను మహిళల ఫోన్ లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఏ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నా.. ఎస్ ఓఎస్ బటన్ నొక్కినా, లేదా ఐదుసార్లు ఫోన్ షేక్ చేసినా చాలు.. వెంటనే పోలీసుల దగ్గరి నుంచి వెంటనే ఫోన్ వచ్చేది. ఆ ఫోన్ కు ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఆపదలో ఉన్నామని చెప్పినా, లేదా రిప్లయ్ ఇవ్వకపోయినా.. 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చే వాళ్లు.

బాధితుల సమస్యలు అడిగి తెలుసుకునే వాళ్లు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితులు లేవు. అక్క చెల్లెమ్మలకు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని. చంద్రబాబు పాలనలో ఘోరంగా విఫలమయ్యారు” అని జగన్ ధ్వజమెత్తారు.

 

Also Read : వైసీపీకి రాజీనామా చేసిన వాసిరెడ్డి పద్మ.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు