Kakani Govardhan Reddy : చంద్రబాబే ఇలా మాట్లాడించి ఉంటారు- విజయసాయిరెడ్డి ఆరోపణలపై మాజీమంత్రి కాకాణి కీలక వ్యాఖ్యలు..
విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య రహస్య స్నేహం ఉండి ఉండాలని చెప్పారు.

Kakani Govardhan Reddy : వైఎస్ జగన్ చుట్టూ కోటరీ ఉందని, అందుకే తాను జగన్‌కు దూరం అయ్యానంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీలో చర్చకు దారితీశాయి. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై మాజీమంత్రి కాకాణి తీవ్రంగా స్పందించారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని ఆయన అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు విజయవంతం అయ్యాయని అన్నారు.
ప్రజలను డైవర్ట్ చేసేందుకే చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఉంటారని కాకాణి అనుమానం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుందని చెప్పారు. తెలిసే ఇదంతా చేశారన్న కాకాణి.. ఇందులో గూడుపుఠాని ఉందన్న అనుమానం కలుగుతోందన్నారు.
Also Read : అందుకే వైఎస్ జగన్‌కు దూరం అయ్యాను.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య రహస్య స్నేహం ఉండి ఉండాలని చెప్పారు. లేదంటే సాయిరెడ్డి ఇళ్లు ఎందుకు అద్దెకిచ్చారని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవని ఆయన తేల్చి చెప్పారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి గంటలు గంటలు ఏకాంతంగా మాట్లాడే వారని చెప్పారు. అలాంటిది ఏ కోటరీ ఉందని చెబుతారని మండిపడ్డారు.
కాగా.. వైసీపీకి రాజీనామాపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే తాను ఆయనకు దూరమయ్యానన్నారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసిందని.. ఆ విషయం తెలిసి తన మనసు విరిగిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని తాను జగన్‌కు చెప్పినట్టు వెల్లడించారు. ముందు కోటరీ నుంచి జగన్ బయటపడాలని విజయసాయిరెడ్డి సూచించారు. అప్పుడే జగన్‌కు భవిష్యత్ ఉంటుందన్నారు.
Also Read : తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు: చంద్రబాబు