తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు: చంద్రబాబు
"ఎస్సీ, ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చాం. త్వరలో టిడ్కో లైవ్ లీ హుడ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం" అని అన్నారు.

Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మహిళాసాధికారతపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. “మహిళా సాధికారత వచ్చినప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. మహిళల స్వావలంబన, సాధికారత కోసం నిన్న, నేడు, రేపూ ఎప్పుడూ టీడీపీ పనిచేస్తుంది. జెండర్ ఈక్వాలిటీతో ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం రావాల్సిందే” అని అన్నారు.
“ఇప్పటికీ మహిళ పట్ల సమాజంలో వివక్ష చూపిస్తూనే ఉన్నారు. మహిళలకు సాధికారత టీడీపీతోనే ప్రారంభమైంది. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆరే. మహిళలకు ఆస్తిలో సమానహక్కు అని 2005 చట్టం చేశారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి రాష్ట్రానికి శానసభలో ఉండి ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. మహిళా 33 రిజర్వేషన్ పాలసీతో ఎంపికైన అధికారి సూర్యకుమారి ఇప్పుడు మహిళా శిశు సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మహిళలకు సంబంధించి విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
తల్లి బిడ్డా ఎక్స్ ప్రెస్ లాంటి పథకాలను అమలు చేస్తున్నాం. తదుపరి దశ సాధికారత దిశగా డ్వాక్రా సంఘాలను నడపాలని భావిస్తున్నాం. రూ.4217 కోట్ల స్త్రీనిధి రుణాలు మంజూరు చేశాం. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 300 కోట్ల మేర వడ్డీ లేని రుణం కూడా ఇచ్చాం. త్వరలో టిడ్కో లైవ్ లీ హుడ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాం.
లఖ్ పతీ దీదీ కార్యక్రమంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతంలో 10 లక్షల మంది కంటే ఎక్కువమంది లక్ష కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉన్నారు. అటు పట్టణ ప్రాంతాల్లో దీనికి రెట్టింపు సంఖ్యలో లఖ్ పతీ దీదీలు ఉన్నారు. 2.50 కోట్ల మంది మహిళలు రాష్ట్రంలో ఉన్నారు.
రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల ద్వారా వచ్చే ఏడాది రూ.65 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. అయితే డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఇన్ని వేల కోట్ల రూపాయలను ఉపాధి దిశగా ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం” అని అన్నారు.