తారుమారయ్యాయి, ప్రజలు ఇంకా తేరుకోలేదు- ఎన్నికల ఫలితాలపై మరోసారి రోజా కీలక వ్యాఖ్యలు
తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
Roja Selvamani : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆమె అన్నారు. అంతేకాదు.. మొన్నటి ఎన్నికల ఫలితాల నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదని కామెంట్ చేశారు. నగరిలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు.
వైఎస్ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వైఎస్సార్ ఒక యుగపురుషుడు అని కొనియాడారు. ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన మహనీయుడు వైఎస్ఆర్ అని కితాబిచ్చారు. తన పాలనతో వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని రోజా అన్నారు. ఆ దేవుని పాలన మరోసారి అందించిన వ్యక్తి వైఎస్ జగన్ అని రోజా అన్నారు.
సెప్టెంబర్ 2 2009.. దేశ చరిత్రలోనే పెద్ద రాజకీయ విషాదం..
”వైఎస్ఆర్ అంటే.. తెలుగు ప్రజలకు ఎమోషన్, వైఎస్ఆర్ అంటే తెలుగు ప్రజలకు అఫెక్షన్. సెప్టెంబర్ 2 2009… దేశ చరిత్రలోనే పెద్ద రాజకీయ విషాదం. ప్రతిపక్షాలు సైతం కన్నీళ్లు పెట్టుకున్న యుగపురుషుడు వైఎస్ఆర్ మన నుంచి దూరంగా వెళ్లిపోయారు. భౌతికంగా ఆయన దూరంగా వెళ్లారు కానీ, ఈనాటికి పేదల గుండెల్లో గుడి కట్టుకుని ఉన్న గొప్ప యుగపురుషుడు. ప్రతి గడపకు ఆయన తన పరిపాలనతో దగ్గరయ్యారు. ఆయన చనిపోయిన రోజు ఎన్నో గుండెలు అలసిపోయేలా ఏడ్వటం, ఆగిపోవటం కళ్లారా చూశాం.
దేవుడి పాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్ చూపించారు..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి వచ్చాకే ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని దూరం చేయడం కోసం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారు. ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా ఆయన పరిపాలన సాగించారు. చరిత్రలో దేవుడి పాలన, రాముడి పాలన అని విన్నాం. అలాంటి పాలనను రాజశేఖర్ రెడ్డి పాలనలో అందరం కళ్లారా చూశాం. ఆయన లేని లోటును ఆయన బిడ్డ జగన్ నేనున్నా అంటూ వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎన్ని కష్టాలు, అవమానాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రజలకు మళ్లీ రాజన్న పరిపాలన అందించడం కళ్లారా చూశాం.
Also Read : ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిల.. జగన్‌పై కీలక వ్యాఖ్యలు
జగన్ ను మళ్లీ సీఎం చేస్తాం..
కానీ, మొన్న ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలే ఇంకా తేరుకోని పరిస్థితి ఉంది. ఫలితాలు తారుమారు అవడం చూశాం. రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు వైసీపీ కార్యకర్తలు, నాయకుల గొంతులో ప్రాణం ఉన్నంత వరకు.. వైఎస్ఆర్ అన్న బ్రాండ్ కోసం మేము పని చేస్తూనే ఉంటాం. మళ్లీ వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టుకునేలా జగన్ ను సీఎం చేసే విధంగా రాష్ట్రంలో ప్రజలకు మళ్లీ మంచి చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే విధంగా ప్రతి వైఎస్ఆర్ కుటుంబసభ్యుడు, కార్యకర్త, నాయకుడు పని చేస్తాడని ప్రతిజ్ఞ చేస్తున్నాం” అని రోజా తెలిపారు.