విశాఖలో కొంప ముంచిన పార్టీ : స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి

విశాఖ కసింకోటలో నాటుసారాగా భావించి సర్జికల్ స్పిరిట్ తాగిన ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. స్పిరిట్ తాగి ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా… తాజాగా KGH లో చికిత్స పొందుతూ పాంగి దొరబాబు, మాణిక్యం మృతి చెందారు.
కశింకోట గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనందరావు తన స్నేహితులతో కలిసి శనివారం పార్టీ చేసుకుందామనుకున్నాడు. మంచి కిక్ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్ తీసుకొచ్చాడు.. స్నేహితులంతా దాన్ని తాగేశారు. దీంతో వాళ్లు తీవ్ర అస్వస్థతకు గురికాగా.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరికి స్పిరిట్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతి చెందిన వారిని వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒకరు లారీ క్లీనర్. ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మాణిక్యం రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read: ఏపీలోకి రావాలంటే షరతులు వర్తిస్తాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్