Kakani Govardhan Reddy: కలెక్టర్‌పై మాజీ మంత్రి కాకాణి ఫైర్.. వారిని తొలగించే అధికారం నీకు లేదంటూ..
మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ పై ఫైర్ అయ్యారు. కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని అన్నారు.

Kakani Govardhan Reddy
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ పై ఫైర్ అయ్యారు. కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ క్రాస్ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఆదేశాలను కలెక్టర్ పాటిస్తున్నారని, రెడ్ క్రాస్ ప్రాథమిక సభ్యత్వం నుంచి వైసీపీ సానుభూతి పరులను తొలగించే అధికారం కలెక్టర్ కు ఎక్కడిదంటూ కాకాణి ప్రశ్నించారు. కలెక్టర్ హోదాలో కూర్చునే అర్హత ఆనంద్ కు ఉందోలేదో ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంటూ సూచించారు.
Also Read: ఉన్నట్లుండి ఈటల రాజేందర్ దూకుడు పెంచడంలో వ్యూహమేంటి? చేయి చేసుకోవడానికి కారణం అదేనా?
ఇండియన్ రెడ్ క్రాస్ జాతీయ చైర్మన్ గా బీజేపీ ఎంపీనే ఉన్నారు. రాజకీయ నేతలు ఉండకూడదనే నిబంధన ఎక్కడా లేదు. కానీ, కలెక్టర్ వైసీపీ సానుభూతిపరులను తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. రెడ్ క్రాస్ వివాదాస్పదం కాకూడదని చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు. రెడ్ క్రాస్ విలువ పెంచేలా చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరించారు. రెడ్ క్రాస్ హాస్పిటల్ అభివృద్ధి కారకులు చంద్రశేఖర్ రెడ్డి అని కాకాణి గోవర్ధన్ పేర్కొన్నారు. ఉచితంగా సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ ని మంత్రి నారాయణ వాడుకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు.
Also Read: రాచమల్లు తీరుతో వైసీపీ నేతలు ఇరకాటంలో పడిపోతున్నారా?
మంత్రి నారాయణకు అడ్డుగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని కావాలనే తొలగించారు. రెడ్ క్రాస్ విషయంలో గత కలెక్టర్లకురాని ఇబ్బంది.. ఇప్పుడున్న కలెక్టర్ కి ఏమొచ్చిందో అర్ధం కావడం లేదు. రెడ్ క్రాస్ ద్వారా టీడీపీ నేతలే సేవ చెయ్యాలనే ఆలోచనలో కలెక్టర్ ఆనంద్ ఉన్నారని, వైసీపీ సానుభూతిపరుల సభ్యత్వాన్ని రద్దు చేయడంపై న్యాయపోరాటం చేస్తామని కాకాణి గోవర్ధన్ తెలిపారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు రెడ్ క్రాస్ లో ఐదువేల మంది సభ్యత్వం ఉంటే వాటిలో 90శాతం మంది పొలిటికల్ పార్టీల వారే ఉన్నారు. వైసీపీ వారికి మాత్రమే ప్రాథమిక సభ్యత్వం రద్దు చెయ్యడం దారుణం. మంత్రి నారాయణకు రెడ్ క్రాస్ సేవ మీద అవగాహన లేదు. కాబట్టే కుట్రలు చేస్తున్నారు. ఆయనకు కనీసం సభ్యత్వం కూడా తీసుకోలేదు. నారాయణ మెడికల్ కాలేజ్ లో కీలకంగా ఉండే విజయ్ కుమార్ అనే వ్యక్తిని రెడ్ క్రాస్ లో మెంబర్ గా చేర్చి దాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నారు.. మంత్రి నారాయణ అనుచరులతో కొత్త బాడీని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆనంద్ ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు.