AP Cabinet Decisions: వారికి ఉచిత విద్యుత్, ఈ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.

AP Cabinet Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 12 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ని అమలు చేయాలని నిర్ణయించారు. ఇతర రాష్ట్రాలకన్నా మెరుగ్గా ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు.
”ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయనున్నాం. ఆర్టీసీలోని 75శాతం (8,456) బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో పథకం అమలవుతుంది. కుటుంబానికి నెలకు 800 రూపాయలు ఆదా అవుతుందని భావిస్తున్నాం” అని మంత్రి తెలిపారు.
”మొన్నటి వరకు చాలా వార్తలు వచ్చాయి. జిల్లాల వరకే ఉచిత బస్సుని ఇస్తారు. జిల్లాల్లో మాత్రమే మహిళలు ప్రయాణం చేయటానికి ఉచితంగా అవకాశం కల్పిస్తారు అని వార్తలు వచ్చాయి. మంత్రి లోకేశ్ చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయటానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై నెలకు 162 కోట్లు, ఏడాదికి 1942 కోట్ల రూపాయల భారం పడుతుంది.
75శాతం (దాదాపు 11వేల 200) ఏపీ ఆర్టీసీ బస్సుల్లో.. దాదాపు 8వేల 456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కాబోతోంది. ఇటువంటి స్కీమ్ దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో మాత్రమే అమలవుతోంది. వారి కంటే మెరుగ్గా ఏపీలో అమలు చేస్తాం. దాదాపు ఏడాదికి 142 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ని వినియోగించుకునే అవకాశం ఉంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ సర్వీసెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తాం” అని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
నూతన బార్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాయీ బ్రాహ్మణ వర్గానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ టెక్ హబ్ పాలసీ 4.0కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. టూరిజం కార్పొరేషన్ లోని 22 ఏపీటీడీసీ హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించారు. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు అనుమతి ఇచ్చారు. 7వేల 500 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చారు.
Also Read: ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..