ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..

ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది.

ఏపీలో మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెలకు రూ.15వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం..

DWCRA Womens

Updated On : August 6, 2025 / 9:24 AM IST

AP Govt: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. మగవారితో పోటీపడుతూ మహిళలుసైతం ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండేలా వారికి కొత్తకొత్త పథకాలను అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మంచి అకాశం కల్పించింది.

భర్త సంపాదనకుతోడు ఇంట్లో కుటుంబానికి చేదోడువాదోడుగా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు ఇప్పించి.. ఎలక్ట్రిక్ వాహనాలు కొనిస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి మెప్మా ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. తద్వారా బైక్ హ్యాండిల్, ఆటో స్టీరింగ్ పట్టుకొని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి ఆసక్తి ఉన్న మహిళలు బైక్, స్కూటీ, ఆటోలను సబ్సిడీ ద్వారా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. స్కూటీ, బైక్ కు రూ.12వేలు, ఆటోకు రూ.30వేలు సబ్సిడీ అందిస్తుంది. ఇందుకోసం జిల్లాల్లోని మెప్మా అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు ఇప్పించి 1,000 ఎలక్ట్రిక్ వాహనాలు (స్కూటీలు) కొనుగోలు చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న, ఆసక్తి ఉన్న మహిళలను అధికారులు ఎంపిక చేశారు. వారికి వాహనాలు ఇవ్వడంతోపాటు.. మెప్మా ద్వారా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. వీరికోసం ప్రభుత్వం ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ర్యాపిడోకు వచ్చే ఆర్డర్లను ఈ మహిళా డ్రైవర్లకు ఇస్తున్నారు.

ప్రస్తుతం.. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి వంటి నగరాలతోసహా మొత్తం ఎనిమిది నగరాల్లో రోజుకు 500 నుంచి 550 రైడ్లు బుక్ అవుతున్నాయని చెబుతున్నారు. ఇలా ఒక్కో బైక్ పై నెలకు రూ.ప15వేలు నుంచి రూ. 18వేలు వరకు ఆదాయం వస్తోందట. అదే ఆటో అయితే.. నెలకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నారట. డ్వాక్రా మహిళలకు ఈ వాహనాలు మాత్రమే కాదు.. అనేక రుణాలు కూడా అందిస్తున్నారు.

మరోవైపు.. డ్వాక్రా మహిళలకు డ్రోన్లు కూడా ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. రైతుల సాగుకు తోడుగా డ్రోన్లు ఉపయోగపడేలా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. త్వరలోనే వీటిని డ్వాక్రా మహిళల చేతికి అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 440 మంది మహిళలకు డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాక.. ఇటీవల డ్వాక్రా మహిళలకు రూ.50వేల విలువైన ఎగ్ కార్ట్‌లను కూడా అందజేసిన సంగతి తెలిసిందే. అంతేకాక.. వారి పిల్లల విద్యకు తోడ్పాటును అందించేందుకు 4శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా.. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది.