ఇక ఐసోలేషన్ వార్డులకు తీసుకెళ్లరు, ఇంట్లోనే ఉచితంగా కరోనా పరీక్షలు, ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
ఇకపై ఇంట్లోనే కరోనా వైద్యపరీక్షలు:
ఓవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూనే, మరోవైపు కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే టెలి మిడిసిన్, వాట్సాప్ ఛాట్ బాట్ లాంటి వినూత్న సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా మాస్కులు పంపిణీ చేయబోతున్నారు. ఒక్కొక్కిరికి మూడు మాస్కులు ఇవ్వనున్నారు. ఇప్పుడు కరోనాపై పోరులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంట్లోనే కరోనా వైద్యపరీక్షలు చేయబోతున్నారు.
ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు:
అవును.. అనుమానిత రోగుల్ని ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు. ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. టెస్టుల్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలిన తర్వాత మాత్రమే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తారు. అయితే టెస్టులు పూర్తయి, ఫలితాలు వచ్చేంత వరకు మాత్రం అనుమానితులంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి.
తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందొచ్చు:
తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందవచ్చని.. ఒకవేళ కరోనా కాదని నిర్థారణ అయితే.. సాధారణ మందులు కూడా అక్కడికక్కడే వైద్యులు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మరింత మంది వైద్య సిబ్బందిని తీసుకునేందుకు 2 రోజుల కిందట నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.
రేషన్ కార్డు లేకున్నా ఉచితంగా బియ్యం:
కరోనా కంటే కరోనా వల్ల ఏర్పడే అసౌకర్యాలే ఎక్కువ. కరోనాతో కొందరు మాత్రమే బాధపడితే.. లాక్ డౌన్ వల్ల సామాన్యులంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందుల్ని తొలిగించేందుకు పేదలకు రేషన్ కార్డు లేకపోయినా ఉచితంగా బియ్యం అందిస్తోంది ప్రభుత్వం. అక్కడికక్కడే కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయించేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా అందించాల్సిన తొలి విడత మాస్కులు కూడా రేపు(ఏప్రిల్ 17,2020) రాబోతున్నాయి.
తెలంగాణలో 650, ఏపీలో 514 కరోనా కేసులు:
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ, ఏపీలో రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 650 మంది కరోనా బారినపడ్డారు. యాక్టివ్ కేసులు 514. ఇప్పటివరకు కరోనాతో 18మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 118మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 525మంది కరోనా బారిన పడ్డారు. ఏపీలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటివరకు 14మంది కరోనాతో చనిపోయారు. 20మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా 20.82లక్షలు, దేశంలో 12వేల 300 కరోనా కేసులు:
దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 12వేల 300కి చేరింది. దేశవ్యాప్తంగా 424మంది మృత్యువాతపడ్డారు. దేశంలో ఇప్పటివరకు 1,357 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే కరోనా బాధితుల సంఖ్య 20లక్షల 82వేలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 34వేల మంది కరోనాకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 14లక్షల 30వేలు. అన్ని దేశాల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5.8లక్షలు.
అమెరికాలో 6.44లక్షలకు చేరిన కరోనా కేసులు, 28వేల 383 మరణాలు:
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 6లక్షల 44వేలకు చేరింది. నిన్న(ఏప్రిల్ 15,2020) కొత్తగా 27వేల 413 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు కరోనాతో 28వేల 383మంది చనిపోయారు. అమెరికాలో నిన్న ఒక్కరోజే 2వేల 336మంది మరణించారు. న్యూయార్క్ నగరంలో గత 24 గంటల్లో 752మంది మృత్యువాతపడ్డారు.
Also Read | కర్నూలులో కరోనాతో ప్రముఖ డాక్టర్ మృతి, ఆందోళనలో రెండు జిల్లాల రోగులు