Madhav: కొత్త అధ్యక్షుడి రాక వేళ ఏపీ బీజేపీలో జోష్.. ఏపీలో కమలం ఫేట్ మారుతుందా?
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్‌పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు.

ఓ చేతిలో బీజేపీ జెండా..ఇంకో చేతిలో కూటమి అజెండా.. కలిసి నడుద్దామ్. పార్టీ కోసం కష్టపడుదాం. ఏపీ బీజేపీ కొత్త సారధి PVN మాధవ్ అధ్యక్షుడి హోదాలో చేసిన మొదటి కామెంట్స్. మనమేం తక్కువ కాదు..అలా అని బలహీనులం కాదంటున్నారు కమలనాథులు. ఏపీలో బీజేపీ బలం ఎంత అని అనేవాళ్లకు అదేస్థాయిలో సౌండ్‌కు రీసౌండ్ ఇస్తున్నారు. ఏపీలో బీజేపీ బలం ఎంతంటే..ఒక పార్టీని అధికారంలోకి తెచ్చేంత..ఇంకో పార్టీని అధికారంలో నుంచి దింపేంత అంటున్నారు కాషాయ లీడర్లు.
కొత్త అధ్యక్ష రాక సందర్భంగా పార్టీ కోసం, కూటమి బలోపేతం కోసం..అంతే కాదు పదవుల కోసం ఇలా ఎవరి వాయిస్ వాళ్లు వినిపించారు. కూటమికి తిరుగులేదని కొందరు అంటే..సొంతంగా బలోపేతం కావాలని మరికొందరు ఆకాంక్షించారు. ఏపీలో బీజేపీని తిరుగులేని శక్తిగా తయారు చేయడమే లక్ష్యమంటున్నారు. అనూహ్యంగా బీజేపీ రథసారధి రేసులోకి వచ్చిన మాధవ్..ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా మంచి, చెడు భవిష్యత్ ప్రణాళికపై తమ ఒపీనియన్స్ వ్యక్తం చేశారు లీడర్లు.
కూటమిగా ఉన్నామ్. మనకు రావాల్సిన పదవుల వాటా రావాల్సిందేనని కొందరు పట్టుబట్టారు. ఇక మరికొందరు అయితే ఒంటరిగా అధికారంలోకి వచ్చేందుకు శ్రమించాలంటున్నారు. ఇంకొందరు కీలక లీడర్లు అయితే.. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి బీజేపీ కార్యకర్తలను ఆలోచింపజేసేలా మాట్లాడారు. కూటమిగా మనకు 57శాతం ప్రజల మద్దతు ఉంది. ఇంకా 43 శాతం జనం మద్దతు బీజేపీ సొంతంగా దక్కించుకునేలా పనిచేయాలన్నది పలువురు లీడర్ల సూచన. ఎవరి వాయిస్ ఎలా ఉన్నా..ఆర్ఎస్‌ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న మాధవ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు దక్కడం అయితే పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది.
Also Read: టీమిండియా ఓటమికి అసలు కారణం ఇదే.. అసలు మన వ్యూహం ఎక్కడ తప్పుతోంది?
బీజేపీ బలం 5శాతం అన్న కామెంట్స్‌పైనా నేతలు రియాక్ట్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో తమ ఓటు షేర్ కూడా 20శాతానికి పెంచుకుంటామని చెప్తున్నారు. వైసీపీ, జగన్ టీడీపీ, జనసేనకే కాదు..బీజేపీకి కూడా రాజకీయ ప్రత్యర్థి అన్న విషయం మర్చిపోవద్దంటున్నారు కమలనాథులు. అందుకే లోకల్ బాడీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చర్చనీయాంశంగా లీడర్ల కామెంట్స్
వైసీపీని, జగన్‌ను ఎదుర్కోవడం ప్రధాన ఎజెండాగా పెట్టుకోవాలని..కూటమిగా ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు కామన్ అన్నట్లు వాటి గురించి పెద్దగా ఆలోచించొద్దంటూ సీనియర్ లీడర్లు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పలువురు నేతలు పదవుల కోసం పదేపదే మాట్లాడుతుండటంతో పార్టీ పెద్దలు అలా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ సొంతంగా ఎదిగి అధికారంలోకి రావడం తర్వాత విషయం. ప్రస్తుతం కేంద్రంలో టీడీపీ అవసరం బీజేపీకి ఉంది. టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ఎన్డీయే సర్కార్ నిలబడుతుందనేది ఓపెన్ సీక్రెట్.
ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పలువురు సీనియర్ లీడర్లు కూటమి అవసరం, పొత్తు ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై పలు సూచనలు చేశారట. అయితే నామినేటెడ్ పదవుల విషయంలో టీడీపీ, జనసేన అధ్యక్షులతో డిస్కస్ చేసి..తమకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరనున్నారట. ఏదైనా కొత్త అధ్యక్ష ఎన్నిక ఏపీ బీజేపీ నేతలందరినీ ఒకే మీదకు తెచ్చిందన్న చర్చ అయితే జరుగుతోంది. అందులో ఎవరి వాయిస్ వారిది. ఎవరి ఒపీనియన్ వాళ్లది. కానీ పార్టీకంటూ కొన్ని అవసరాలు..ప్రణాళికలు ఉంటాయని వాటి ప్రకారమే పనిచేసుకుంటూ పోతామంటున్నారు ఏపీ బీజేపీ లీడర్లు.