Tirumala Fuel Shortage: తిరుమలలో పెట్రోల్, డీజిల్ కొరత.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తులు
తిరుమలకు పెట్రోల్ సరఫరా కాకపోవడంతో రెండు పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tirumala Fuel Shortage: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమైంది. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల క్యూలైన్ కనిపిస్తోంది. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. కొన్ని చోట్ల బ్లాక్ లో విక్రయాలు జరుగుతున్నాయి. బ్లాక్ లో విక్రయాలపై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంధన కొరతతో వాహనదారులు అల్లాడిపోతున్నారు.
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెట్రోల్ కొరత ఏర్పడింది. తిరుమలలో ఉన్న రెండు పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శ్రీవారి భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తిరుమలకు పెట్రోల్ సరఫరా కాకపోవడంతో రెండు పెట్రోల్ బంకుల్లోనూ నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమలలో రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒకటి హెచ్ పీ, మరొకటి ఐవోసీఎల్ పెట్రోల్ బంకు. ఈ రెండు బంకుల్లోనూ ఇవాళ ఉదయం నుంచి పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో మూసివేసిన పరిస్థితి. తిరుమలకు నిత్యం 8వేల నుండి 9వేల ఫోర్ వీలర్స్ (కార్లు, జీపులు) వస్తుంటాయి. వీటికి తిరుమలలోని పెట్రోల్ బంకుల ద్వారా ఇంధనం సప్లయ్ అవుతుంది. అయితే, ఈ బంకుల్లో ఫ్యూయల్ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ దొరకదేమో అన్న భయంతో వాహనదారులు డబ్బాల్లో పట్టుకెళ్తున్నారని, దాని వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బంకులు నిర్వాహకులు చెబుతున్నారు. రేపటి నుంచి ఈ సమస్య ఉండదని, యధావిధిగా పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంటుందని బంకుల నిర్వాహకులు వెల్లడించారు.
మరోవైపు కొన్ని బంకుల్లో 300 రూపాయలకు మించి పెట్రోల్ పోయడం లేదని, 1500 రూపాయలకు మించి డీజిల్ కొట్టడం లేదని వాహనదారులు వాపోతున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా డీజిల్ కష్టాలు మొదలయ్యాయి. డీజిల్ లేక కార్లు, లారీలు నిలిచిపోతున్నాయి. కొన్ని పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. మిర్చి యార్డ్ దగ్గర ఎక్కడికక్కడ లారీలు నిలిచిపోయాయి. డీజిల్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత..! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
