రైతులకు శుభవార్త : కేపీ ఉల్లి నిషేధం ఎత్తివేత

కృష్ణాపురం ఉల్లి ఎగుమతులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు కేపీ ఉల్లిగడ్డలపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. 10 వేల మెట్రిక్ టన్నుల కేపీ ఉల్లిని చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020, మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేపీ ఉల్లిపై నిషేధం ఎత్తివేయడంపై ఉల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేపీ ఉల్లి రైతుల సమస్యలను పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఉల్లి ఎగుమతులపై నిషేధం వల్ల..రైతులు తాము పండించిన పంటను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వెల్లడించారు. వెంటనే నిషేధం ఎత్తివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
నిషేధం ఎత్తివేయడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దీని కోసం కృషి చేసినందుకు..రైతు సంఘాల నేతలు తమను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు ట్వీట్‌లో తెలిపారు. రైతు సంక్షేమమే తమ లక్ష్యం..అదే తమ విధానం కూడా అంటూ తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో ఎక్కువగా కేపీ రకం ఉల్లి పంటలను పండిస్తుంటారు. అయితే..ఎగుమతులపై నిషేధం ఉండడం వల్ల వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేయలేకపోతున్నారు. సింగపూర్, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు.
కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. దీని కోసం కృషి చేసినందుకు రైతు సంఘాల నేతలు ఢిల్లీలో ఈరోజు మమ్మల్ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. రైతు సంక్షేమమే మా లక్ష్యం. అదే మా విధానం కూడా. pic.twitter.com/fH5fW7VQUl
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 6, 2020