AP Govt: రూ.600 కోట్లు విడుదల.. విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కాలేజీలకు సీరియస్ వార్నింగ్..
దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేసింది.

AP Govt: ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అదే సమయంలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న విద్యా సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది.
ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం అమలు కోసం రూ.600 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. 2024-25 ఏడాదికి అదనపు మొత్తం విడుదల చేసినట్లు ఉన్నత విద్యాశాఖ ప్రకటించింది. ఇప్పటికే మొదటి విడతగా ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.788 కోట్లు చెల్లించామని, త్వరలో మరో 400 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. దశలవారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆలోపు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దని విద్యాశాఖ తేల్చి చెప్పింది.
విద్యార్థులను ఇబ్బంది పెడితే కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం కింద రావాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వంటి చర్యలకు విద్యా సంస్థలు పాల్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: జూనియర్లపై సీఎం గరం.. సీనియర్లలో ఆశలు.. క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు?
ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. విమర్శలు ఎక్కు పెట్టాయి. దీంతో ప్రభుత్వం ఒక్కరోజులోనే 600 కోట్లు విడుదల చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడతగా 788 కోట్లు ప్రభుత్వం గతంలోనే విడుదల చేసింది. రాబోయే కొన్ని రోజుల్లో మరో 400 కోట్లు విడుదల చేస్తామని విద్యాశాఖ తెలిపింది. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు రాలేదనే నెపంతో కొన్ని విద్యా సంస్థలు ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలు లాంటి సంస్థలు పిల్లలకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడం, వారి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో వివిధ రకాల పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న అంశం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులపై ఒత్తిడి తెచ్చినా, వారిని ఇబ్బంది పెట్టినా, వారికి కావాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకపోయినా సంబంధిత కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. మొత్తం ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి ప్రభుత్వం బకాయిలు విడుదల చేయటం, రాబోయే రోజుల్లో మరో 400 కోట్లు విడుదల చేస్తామని చెప్పడం విద్యార్థులకు పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు.