Ration Distribution : ఏపీలోని పేద ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి అవన్నీ ఉచితంగా సరఫరా

Ration Distribution : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు ..

Ration Distribution : ఏపీలోని పేద ప్రజలకు శుభవార్త.. ఇక నుంచి అవన్నీ ఉచితంగా సరఫరా

Ration Distribution

Updated On : December 7, 2025 / 12:50 PM IST

Ration Distribution : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం, మారుతున్న ఆహార అలవాట్లను దృష్టిలో పెట్టుకుని పేద ప్రజలకు పోషక విలువలు కలిగిన తృణధాన్యాలను ఉచితంగానే సరఫరా చేస్తోంది.

గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో రేషన్ కార్డుదారులకు రాగులు, రాగిపండిని ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేసింది. ఇప్పుడు మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ సరుకుల్లో తృణ ధాన్యాలను అందించాలని నిర్ణయించింది.

అప్పట్లో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రంలో పీడీఎస్ అవసరాలకు సరిపడా రాగులు, జొన్నలను కేటాయించేది. ఇప్పుడు కేంద్రం కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే వాటిని టెండరు ప్రక్రియ ద్వారా సేకరించి కార్డుదారులకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

మారుతున్న కాలానుగుణంగా ఆరోగ్యంపై ప్రజల్లో శ్రద్ద పెరుగుతోంది. ఈ క్రమంలో రాగులు, జొన్నల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ రాగులు, జొన్నలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

ఇప్పటికే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప, నంద్యాల జిల్లాల్లో గత ఏప్రిల్ నుంచే రేషన్ కార్డుదారులకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, పంచదారతో పాటు రాగులు, జొన్నలు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. అయితే, ఈ డిసెంబర్ నెల నుంచి ఉత్తర కోస్తా ప్రాంతంలోని విశాఖ, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో రాగులను అందిస్తుంది.

ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో జొన్నల పంపిణీని ప్రారంభించింది. ప్రతి మనిషికి ఐదు కేజీల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ రేషన్లో కొంతమేర బియ్యానికి బదులుగా గరిష్ఠంగా మూడు కేజీల వరకు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రతి నెలా 20కేజీల రేషన్ బియ్యం తీసుకునే కుటుంబం.. ఇప్పుడు రెండు కేజీల రాగులు మాత్రమే కావాలనుకుంటే.. ఆ మేరకు బియ్యాన్ని మినహాయించుకుని మిగిలిన 18కేజీల బియ్యాన్ని, రెండు కేజీల రాగులను అందిస్తారు.