ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..

ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్‌ కెరీర్‌లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు.

ఒక్క ఓటమితో సీన్ రివర్స్..! చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని భారీ డైలాగ్‌లు, కట్ చేస్తే..

Peddireddy Ramachandra Reddy : ఆయన పేరు పెద్దిరెడ్డి… రాష్ట్ర రాజకీయాల్లో ఆయనో పెద్దారెడ్డి. తన కనుసైగతో రాయలసీమ జిల్లాలను శాసించారు. ఇక ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డే ఉండేది కాదు. ఆ స్పీడ్‌ చూస్తే… పెద్దిరెడ్డిని ఢీకొట్టే వారు లేరు.. రారు.. ఉండరు.. అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఒక్క ఓటమి పెద్దిరెడ్డి రాజకీయాన్ని తలకిందులు చేసింది. సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లలేని నిస్సహాయస్థితి ఏర్పడింది. అత్తారింటికి దారేది.. అన్నట్లుగా తన ఇలాకా పుంగనూరుకు వెళ్లే దారి కోసం వేచి చూస్తున్నారు పెద్దిరెడ్డి.

పెద్దిరెడ్డికి రిటర్న్‌ గిఫ్ట్‌.. పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు..
ఓడలు బండ్లు… బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో… గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మకుటం లేని మహారాజులా ఏలిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పుంగనూరులో అడుగు పెట్టలేకపోతున్నారు. మంత్రిగా ఉండగా, టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును ఓడిస్తానని… చంద్రబాబును కుప్పంలో అడుగుపెట్టకుండా చేస్తానని, హిందూపురంలో బాలకృష్ణను ఓడించి వైసీపీ జెండా ఎగరేస్తానని భారీ డైలాగులు చెప్పిన పెద్దిరెడ్డికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా పోలీసులతో అడ్డుకోవాలని చూసిన పెద్దిరెడ్డి… ఇప్పుడు పుంగనూరులో కాలు పెట్టలేకపోతున్నారు. రాష్ట్రంలో వైసీపీ గెలిచిన 11 స్థానాల్లో ఒకటైన పుంగనూరు ఎమ్మెల్యేగా… ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి వెళ్లలేకపోయారు పెద్దిరెడ్డి..

40 ఏళ్ల రాజకీయంలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారి..
ఎన్నికల ఫలితాలు వచ్చి 20 రోజులు కావస్తున్నా… పుంగనూరు వెళ్లలేకపోయిన పెద్దిరెడ్డి రెండు, మూడుసార్లు నియోజకవర్గానికి వెళ్లినా.. శాంతిభద్రతల సమస్య వస్తుందని పోలీసులు అనుమతించడం లేదు. ఇప్పటికీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా, పలుమార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి పొలిటికల్‌ కెరీర్‌లో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదంటున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ తన నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగిన పెద్దిరెడ్డి.. 40 ఏళ్ల రాజకీయంలో తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని పరిస్థితి తెచ్చుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఇంతటి ప్రతిఘటన ఎప్పుడూ ఎదురుకాలేదు..
సీఎం చంద్రబాబుతోపాటు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి… ఇన్నేళ్లు ఉప్పు-నిప్పులా, తూర్పు పడమరల్లా రాజకీయాలు చేసినా, పెద్దిరెడ్డికి ఎప్పుడూ ఇంతటి ప్రతిఘటన ఎదురుకాలేదని గుర్తుచేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ, ఈసారి పెద్దిరెడ్డి పుంగనూరు వస్తే అడ్డుకుంటామని టీడీపీ క్యాడర్‌ బహిరంగంగా హెచ్చరికలు చేస్తుండటానికి గత ఐదేళ్లుగా పెద్దిరెడ్డి అనుసరించిన విధానాలే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పుంగనూరు పర్యటనకు వస్తే రాళ్ల దాడులు చేయించడం, అంగళ్లులో టీడీపీ క్యాడర్‌పై దాడులకు దిగడం వంటి సంఘటనలను అదుపు చేయడంలో విఫలమవ్వడమే పెద్దిరెడ్డి ప్రస్తుత దుస్థితికి కారణంగా చూపుతున్నారు పరిశీలకులు.

పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై దాడి..
ఇక చంద్రబాబు అరెస్టు సమయంలో శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పం వరకు సైకిల్‌ యాత్ర చేసిన టీడీపీ కార్యకర్తలపై పుంగనూరులో దాడి జరిగితే… ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం కూడా పెద్దిరెడ్డిపై విమర్శలకు దారితీసింది. ఈ సంఘటనలను మరచిపోలేని టీడీపీ క్యాడర్‌ పెద్దిరెడ్డి పుంగనూరు రాకుండా అడ్డుకుంటోంది.

ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు విడుదలైతే… 14న సొంత నియోజకవర్గం పుంగనూరు పర్యటనకు వెళ్లాలని భావించారు పెద్దిరెడ్డి. ఎమ్మెల్యే వస్తున్నారనే సమాచారం అందుకున్న టీడీపీ నేతలు… ఎలా వస్తారో చూస్తామంటూ అడ్డుకోడానికి సిద్ధమయ్యారు. దీంతో పెద్దిరెడ్డి పర్యటన విరమించుకోవాల్సిందిగా పోలీసులు సూచించారు. ఆ తర్వాత కూడా ఈ 10 రోజుల్లో రెండు మూడుసార్లు పుంగనూరు వెళ్లేందుకు ప్రయత్నించినా, వీలుకాలేదు. దీంతో పెద్దిరెడ్డి పుంగనూరు వెళ్లేదారేది…? అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయనని డైలాగ్‌లు పేల్చిన పెద్దిరెడ్డి ఇప్పుడు నిస్సహాయంగా మారిపోగా, చంద్రబాబు సీఎంగా తన తొలి పర్యటనను కుప్పంలో పూర్తి చేశారు.

Also Read : పవన్ కల్యాణ్ గెలుపుతో పిఠాపురం దశ మారనుందా? జనసేనాని మాస్టర్ ప్లాన్ ఏంటి?