JanaSena: ఒంగోలు జనసేనలో వర్గపోరు.. అసలేం జరుగుతోంది?

పదవుల విషయంలో.. స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు.

JanaSena: ఒంగోలు జనసేనలో వర్గపోరు.. అసలేం జరుగుతోంది?

Updated On : March 6, 2025 / 8:27 PM IST

అప్పుడెప్పుడో మొదలైన రచ్చ.. విభేదాలకు దారి తీసి.. వివాదంగా చెలరేగి.. ఇప్పుడు వర్గపోరుగా మారింది. ఏదో అనుకొని జనసేనలో చేరితే.. బాలినేనికి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. లోకల్‌ నేతలు బాలినేని పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. అసలు ఒంగోలు జనసేనలో ఏం జరుగుతోంది.. వర్గపోరుకు అసలు కారణం ఏంటి.. పవన్‌ దృష్టి పెట్టకపోతే పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉందా..

పార్టీ ఓటమో.. లేదంటే అంతర్గత విభేధాలో.. కారణం ఏదైనా వైసీపీకి బైబై చెప్పిన బాలినేని.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఐతే ఆయన చేరినప్పటి నుంచి గాజు గ్లాసులో సెగలు రేగుతున్నాయ్. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్‌కు, బాలినేని మధ్య దూరం పెరిగిపోతోంది. దీంతో జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరింది.

బాలినేని చేరికపై మొదటి నుంచి రగిలిపోతున్న రియాజ్‌… బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిజానికి బాలినేని పార్టీలోకి రావడం రియాజ్‌కు ఇష్టం లేదట. బాలినేనిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. బాలినేని పార్టీలోకి రావడం ఆయనకు మింగుడు పడడం లేదు. పార్టీలో చేరినా నాటి నుంచి ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉండిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

పవన్‌కు నమ్మినబంటులా రియాజ్‌
పార్టీలో చేరికపై కనీస సమాచారం ఇవ్వకుండా బాలినేని తనను అవమానించారని.. బాలినేనిని ఇంతవరకు కలవలేదని, ఇక ముందు కూడా కలిసేది లేదని రియాజ్ తెగేసి చెప్తున్నారు. పవన్ ఆదేశిస్తే తప్ప.. జిల్లాలోబాలినేనితో కలిసి నడిచే పరిస్థితి లేదని ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. పవన్‌కు రియాజ్‌ నమ్మినబంటులా ఉన్నారు.

పవన్‌ను వైసీపీ నేతలు విమర్శిస్తే గట్టి కౌంటర్లు ఇచ్చేవారు. అలాంటిది తన ఇలాఖాలోకి మరో నేత రావడం.. రియాజ్‌కు ఇష్టం లేదని తెలుస్తోంది. దీనికితోడు ఒంగోలు రాజకీయాలపై పట్టు సాధించేందుకు బాలినేని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ముందు నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా గ్రూప్‌గా చేరిపోయారు.. బాలినేనితో ఢీ అంటే ఢీ అంటున్నారు.

జనసేనలో చేరిన తర్వాత కొంతకాలం సైలెంట్‌గా ఉన్న బాలినేని.. ఆ తర్వాత తన అనుచరులు 20మంది కార్పొరేటర్లను తీసుకుళ్లి పవన్ సమక్షంలో పార్టీలో చేర్పించారు. ఈ కార్యక్రమానికి రియాజ్‌ వచ్చినా.. అంటీముట్టనట్లుగానే వ్వవహరించారనే గుసగుసలు వినిపించాయ్. బాలినేని వర్గం యాక్టివ్‌ కావడంతో.. రియాజ్‌ అలర్ట్ అయ్యారు.

బాలినేని వర్సెస్‌ మిగతా నేతలు
ఒంగోలు రాజకీయాలపై బాలినేని ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం అని ఫిక్స్ అయి.. తన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బాలినేనితో పాటు వైసీపీ నుంచి జనసేనలో చేరిన కంది రవిశంకర్‌తో కలిసి.. ఎమ్మెల్యే వైపు చేరిపోయారు. దీంతో బాలినేని వర్సెస్‌ మిగతా నేతలు అన్నట్లుగా సీన్ మారిపోయింది. జనసేనలో ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరింది.

ఒంగోలు వర్గ పోరు.. జనసేనలో కొత్త చర్చకు దారి తీస్తోంది. పదవుల విషయంలో.. స్థానిక పరిస్థితులను లెక్కలోకి తీసుకోవాలని పవన్ డిసైడ్ అయ్యారు. దీంతో బాలినేని పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరి బాలినేనికి కీలక పదవి అప్పగిస్తే.. పార్టీలో మిగతా నేతల వ్యవహారం ఏంటన్నది కూడా మిలియన్ డాలర్ ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల మధ్య పవన్ రంగంలోకి ఒంగోలులో పరిస్థితులు సెట్ చేయాల్సిన అవసరం ఉందనే చర్చ జరుగుతోంది.