Gossip Garage : రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూమిని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి కారణం అదేనా?
వైసీపీ నేతల విమర్శల్ని కూటమి నేతలు ఖండిస్తున్నారు. రామానాయుడు స్టూడియో కోసం నిర్మించిన స్థలం జోలికి వెళ్లలేదని కూటమి నేతలు బల్లగుద్దీ మరి చెబుతున్నారు.

Ramanaidu Studios
Gossip Garage : రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూమిలో సగం కూటమి సర్కార్ వెనక్కి తీసుకుంది. సర్కార్ నిర్ణయం వెనుక ఎన్నో కథనాలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి. పొలిటికల్ గేమ్ ఉందంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ కుట్రకు చెక్ పెట్టడానికి సర్కార్ ఇలా చేసిందనే ప్రచారం కూడా వినిపిస్తుంది. అసలు రామానాయుడు స్టూడియో భూముల వెనుక జరిగిన వ్యవహారమేంటి? కూటమి ప్రభుత్వం ఈ షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రామానాయుడు స్టూడియోకు తెలుగుదేశం ప్రభుత్వమే విశాఖలో భూములు ఇచ్చింది. అందులో సగం భూమిని ఇప్పుడు అదే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇచ్చిన ప్రభుత్వమే ఎందుకు విత్‌డ్రా చేసుకుంది? ఇప్పుడిదే ప్రశ్న ఏపీ పాలిటిక్స్‌లో మెయిన్ డిబెట్ పాయింట్..
అప్పడు భూమి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు..
విశాఖలో సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీమిలి బీచ్ రోడ్డులో మధురవాడలో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేశ్ ప్రొడక్షన్‌కు ఎకరా 52 లక్షలు చొప్పున కేటాయించింది. అప్పడు భూమి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో సినిమా రంగం అభివృద్ధి చెందితే వేలాది మందికి ప్రత్యేక్ష్యంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఐతే రామానాయుడు స్టూడియోకి కేటాయించిన భూమిలో సగం రిటర్న్ తీసుకోడంతో పొలిటికల్ సర్కిళ్లల్లో బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది. రామానాయుడు స్టూడియో కోసం విశాఖలో కేటాయించిన భూముల్ని కూటమి ప్రభుత్వం ఎలా వెనక్కి లాగేసుకుంటుందని సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏపీలో చిత్రసీమ అభివృద్ధిని జరగకుండా కూటమి సర్కార్ అడ్డుకుంటుందని వైసీపీ నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారట.
అయితే రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూమిలో సగం వెనక్కి తీసుకోవడం వెనుక పెద్ద రీజన్ ఉందని చెబుతున్నారు కూటమి నేతలు. రామానాయుడు స్టూడియోకు 34.44 ఎకరాలు కేటాయిస్తే.. అందులోని 15.17 ఎకరాలను వైసీపీ ముఖ్య నేతలు రియల్ ఎస్టేట్ ల్యాండ్‌గా మార్చేశారంటూ కూటమి సర్కార్ పర్కా ఆధారాలు చూపిస్తోంది. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023 మార్చి 2న సురేశ్ ప్రొడక్షన్స్‌పై ఒత్తిడి తెచ్చి దరఖాస్తు చేయించారట.
స్టూడియో భూములను అడ్డగోలుగా కొట్టేసే కుట్ర..!
అధికారుల నుంచి పర్మిషన్ రాకుండానే భూమిని లేఅవుట్‌గా మార్చేసి ప్లాట్లుగా విభిజించారని లోకల్ టాక్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు.. స్టూడియో భూముల్ని అడ్డగోలుగా కొట్టేసే కుట్ర చేస్తున్నారని జనసేన నేతలు గతంలో నిరసనలు కూడా చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో ఆ భూమిలో లేఅవుట్ వేయకుండా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఆ విల్లాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇదంతా గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని బలమైన గాసిప్ కూడా చక్కర్లు కొడుతోంది.
కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచిన రామకృష్ణబాబు ఈ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూముల అంశంపై నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ 15.17 ఎకరాల్లో లేఅవుట్ వేసిన మాట నిజమేనని కలెక్టర్ నివేదించినట్లు తెలుస్తోంది. భూమిని కేవలం ఫిల్మ్ స్టూడియో అభివృద్ధి, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం ఉపయోగించాలనే నిబంధనలు ఉన్నాయి.
ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ.. 15.17 ఎకరాల భూమిని నివాస యాజమాన్యంగా మార్చేందుకు అనుమతి కోరినట్లు పక్కా అధారాల్ని నివేదికలో పొందుపరిచారట కలెక్టర్. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వ సీఎస్ ఆర్ పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఇంజనీరింగ్ ఇంఛార్జిగా తెలుగు కుర్రాడు.. నాలుగేళ్లు పాటు శ్రమించి..
వైసీపీ నేతల విమర్శల్ని కూటమి నేతలు ఖండిస్తున్నారు. రామానాయుడు స్టూడియో కోసం నిర్మించిన స్థలం జోలికి వెళ్లలేదని కూటమి నేతలు బల్లగుద్దీ మరి చెబుతున్నారు. సురేష్ ప్రొడక్షన్ వారి నిర్మాణాలు భూముల్ని వెనక్కి తీసుకోమని చెబుతున్నారట. గతంలో వైసీపీ ముఖ్యనేతలు రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములను మాత్రమే ప్రభుత్వం మళ్లీ తన వెనక్కి తీసుకుందని చెబుతున్నారు.
మొత్తానికి ప్రజల భూమి కబ్జాకు గురికాకుండా మళ్లీ ప్రభుత్వం చేతిలోకి వచ్చిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట కూటమి నేతలు. మొత్తానికి విశాఖలోని రామానాయుడు స్టూడియో భూముల చుట్టూ పెద్ద రాజకీయమే జరిగిందని విశాఖ వాసులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట.