ఇక అంతా అయిపోనట్టేనా? ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు..! క్యాడర్‌లో తీవ్ర గందరగోళం

రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు.

ఇక అంతా అయిపోనట్టేనా? ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు..! క్యాడర్‌లో తీవ్ర గందరగోళం

Gossip Garage : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి షాక్‌ నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఫలితాలు వచ్చి నెల రోజులు కావస్తున్నా.. ఇళ్లు దాటి ఎవరూ బయటకి రావడం లేదు. ఒకరో ఇద్దరో కార్యకర్తలను కలుస్తున్నా.. ముభావంగానే గడుపుతున్నారు. ఐదేళ్లు రాజభోగం అనుభవించిన వారు… ఒక్కసారి పరిస్థితి తలకిందులవడంతో ఇక అంతా అయిపోయిదనకుంటున్నారు.. నేతల తీరును గమనిస్తున్న కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు పక్క చూపులు చూస్తూ, గోడ దూకడానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేల వైఖరితో పార్టీ మరింత డేంజర్‌ డోజ్‌లోకి వెళ్తుందా?

రిజల్స్‌ వచ్చినప్పటి నుంచి ఇళ్లకే పరిమితం..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటమి షాక్‌ నుంచి వైసీపీ ఇంకా కోలుకోవడం లేదు. డిప్యూటీ సీఎం, మంత్రి, హోంమంత్రి వంటి పదవులు అనుభవించిన నేతలు ఉన్న ఉమ్మడి పశ్చిమలో టీడీపీ కూటమి క్లీన్‌స్వీప్‌ చేసింది. 2019లో 15 స్థానాలకు 13 చోట్ల గెలిచిన వైసీపీ… ఈ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోకపోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో రిజల్స్‌ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇళ్లు విడిచి రావడం లేదు. ఒకరిద్దరు ఏదో పని మీద బయటకు వచ్చినా.. క్షణాల్లోనే మళ్లీ ఇళ్లకు వెళ్లిపోతున్నారు. నేతల వైఖరిని పరిశీలిస్తున్న కార్యకర్తలు… సేఫ్‌ జోన్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కొందరు గ్రామస్థాయి నేతలు టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతుండగా, ద్వితీయశ్రేణి నేతలు సైతం అదే దారిని ఎంచుకుంటున్నారు.

ఉండి, భీమవరంలో వైసీపీకి బిగ్ షాక్
టీడీపీ కూటమి హవాలో ఉమ్మడి పశ్చిమలో వైసీపీ గల్లంతైంది. వైసీపీ అభ్యర్థులు పక్కాగా గెలుస్తారనుకున్న చోట కూడా టీడీపీ కూటమే భారీ ఆధిక్యం ప్రదర్శించింది. ముఖ్యంగా వైసీపీ అధినేత టార్గెట్‌ చేసిన ఉండిలో టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు గెలవడం వైసీపీకి షాక్‌ ఇచ్చింది. అదేవిధంగా గత ఎన్నికల్లో జనసేనాని పవన్‌పై గెలిచిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ ఈసారి చిత్తుగా ఓడిపోవడం వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దీంతో ఎలా ముందుకు వెళ్లాలో కూడా తేల్చుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు. ఉండి, ఏలూరులో వైసీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలు కూల్చివేతకు ప్రభుత్వం నోటీసులిచ్చినా, జిల్లాలో వైసీపీ నేతలు పెద్దగా స్పందించలేదు. రాష్ట్ర పార్టీ ఆదేశాలతో కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన నేతలు… నోటీసులు జారీ అయ్యాక పార్టీ ఆఫీసులను సందర్శంచకపోవడం కార్యకర్తల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.

ఇంటి నుంచి బయటకు రాని మంత్రులు..
వైసీపీకి గత ఎన్నికల వరకు 13 మంది ఎమ్మెల్యే ఉండేవారు. ఇందులో ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించారు. ఇక తానేటి వనిత హోంమంత్రిగా, కారుమూరి నాగేశ్వరరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంత్రులుగా పనిచేశారు. వనిత ఐదేళ్లు మంత్రిగా ఉన్నా… ఓడిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడైన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు…. రిజల్స్‌ వచ్చాక ఎక్కడున్నారో కూడా కార్యకర్తలకు తెలియడం లేదు. ఉండిలో పార్టీ కార్యాలయ కూల్చివేత నోటీసులను అసలు పట్టించుకోలేదు శ్రీరంగనాథరాజు. ఇక ఏలూరు నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఇంటికే పరిమితమయ్యారు. తన వద్దకు వచ్చిన వారిని మాత్రమే కలుస్తున్నారు.

నోటీసులు ఇచ్చినా.. కనీసం మాట్లాడటం కూడా లేదు..
ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఏలూరు నగరంలో నిర్మించారు. ఎన్నికలకు ముందే ఈ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకున్నారు. కానీ, అప్పట్లో కుదరక ఎన్నికల తర్వాత ప్రారంభిద్దామని వాయిదా వేశారు. ఇక ప్రభుత్వం మారిన తర్వాత పార్టీ కార్యాలయానికి ఎటువంటి అనుమతులు లేవని బయటపడింది. కొత్తగా ఎన్నికైన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వైసీపీ కార్యాలయాన్ని పరిశీలించి.. ఆ భవనాన్ని డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇలా అధికార పక్షం దూకుడు చూపుతున్నా, ప్రతిపక్షం నుంచి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడాన్ని తప్పుబడుతున్నారు కార్యకర్తలు.

నేతల అడ్రస్‌ కోసం కార్యకర్తలు వెతుకులాట..
ఇక మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఎన్నికల ఫలితాల తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయారు. మధ్యలో ఒకసారి వచ్చి కార్యకర్తల సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత మళ్లీ హైదరాబాద్ కే వెళ్లిపోయారు. నరసాపురం నుంచి పోటీ చేసిన మాజీ ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సైతం ఇంటిని వీడి బయటకు రావడం లేదు. పాలకొల్లు, ఉండి, పోలవరం, ఉంగుటూరు, చింతలపూడి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థుల అడ్రస్‌ కోసం కార్యకర్తలు వెతుకుతున్నారట.

పక్క చూపులు చూస్తున్న ద్వితీయ శ్రేణి నేతలు..
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎందుకు ఓడిందనే విషయంపైనా ఏ ఒక్కరూ సమీక్షించుకోకపోవడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారంటున్నారు. ముఖ్యంగా జిల్లాకు చెందిన ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మాజీ ఎమ్మెల్యేల వైఖరితో వైసీపీ మరింత బలహీనపడే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

Also Read : ఆ కేసులు రీఓపెన్..! వైసీపీ కీలక నేతలే టార్గెట్‌గా ఉచ్చు బిగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం