టార్గెట్ వైసీపీ టాప్ లీడర్లు..! శ్వేతపత్రాల వెనుక చంద్రబాబు వ్యూహం అదేనా..?
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు..... పైకి ధీమాగా కనిపిస్తున్నా.... ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.

White Papers : ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీలో కేసుల భయం మొదలైందా…? శ్వేతపత్రాల పేరిట గత ప్రభుత్వ విధానాలను తవ్వితీస్తున్న కూటమి ప్రభుత్వం… వైసీపీలో టాప్ లీడర్లను బుక్ చేసేలా స్కెచ్ వేస్తోందా? ఆర్థిక విధానాలపై 4 వైట్‌పేపర్లు… మద్యం, ఇసుక పాలసీలపై మరో 2 శ్వేతపత్రాలను సిద్ధం చేస్తున్న ప్రభుత్వం… ఆయా పాలసీల రూపకర్తలకు ఉచ్చుబిగిస్తోందనే టాక్ ప్రతిపక్షంలో గుబులు పుట్టిస్తోంది.
వైసీపీలోని కీలక నేతలకు కేసుల టెన్షన్..
మరో 30 ఏళ్లు మనదే అధికారం అన్న భ్రమలో బతికిన వైసీపీ మాజీ మంత్రులకు కేసుల భయం వెంటాడుతోందట. తాము అధికారంలో ఉండగా, టీడీపీకి చెందిన నేతలను కేసుల్లో ఇరికించి ముప్పతిప్పలు పెట్టిన వైనం కళ్లముందు కదలాడుతుండటంతో చాలామందికి కంటిమీద కునుకులేకుండా పోతుందని అంటున్నారు. అధికారం చేజారిన నుంచి తీవ్ర నిరాశ.. నిస్పృహకు లోనైన వైసీపీలోని కీలక నేతలకు కేసుల టెన్షన్‌తో బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతోందట. శ్వేతపత్రాల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న హడావుడిని చూస్తున్న వైసీపీ మాజీ మంత్రులు…. తప్పించుకునే మార్గాలను వెతుక్కునే పనిలో పడినట్లు చెబుతున్నారు.
గత ప్రభుత్వం తప్పిదాలు తవ్వితీసే పని మొదలు..
కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు పక్షం రోజులు కావస్తోంది. కానీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నుంచే…. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను తవ్వితీసే పని మొదలుపెట్టింది టీడీపీ… దీనికి జనసేన కూడా జతకలవడం, మద్యం, ఇసుక కుంభకోణాలపై దర్యాప్తు చేయాల్సిందిగా బీజేపీ ఫిర్యాదులు చేయడం చూస్తుంటే… కూటమిలోని మూడు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. గత ఐదేళ్లలో బీజేపీ అన్ని విధాలా సహకరించినా… ఆ కృతజ్ఞత కూడా లేకుండా తమపై సీబీఐ విచారణ జరిపించాలంటూ బీజేపీ నేతలే ఫిర్యాదు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వైసీపీ పెద్దలు. మూడు పార్టీలు కూడబలుక్కుని ఓ పథకం ప్రకారం పావులు కదుపుతుండటంతో వైసీపీలో ఎప్పుడు ఏం జరుగుతుందనే టెన్షనే కనిపిస్తోంది.
పెద్దిరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు విడుదలైన నుంచి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తుంటే… రాష్ట్రంలోని ముఖ్యనేతల టార్గెట్‌గానే అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకముందే గనులు, భూగర్భశాఖ కార్యాలయంతోపాటు ఎక్సైజ్‌శాఖ కార్యాలయాన్ని సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. గత ఐదేళ్లలో అడ్డగోలు ఇసుక తవ్వకాలతోపాటు మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్న కూటమి ప్రభుత్వం… ఆ డిపార్ట్‌మ్మెంట్‌లో ఏం జరిగిందో వివరించేందుకు వైట్ పేపర్ సిద్ధం చేస్తోంది. వైసీపీ హయాంలో గనులశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. దీంతో ఆయన చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇసుక, మైనింగ్‌తోపాటు రాయలసీమలోని కొన్ని నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలోనూ పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నట్లు చెబుతున్నారు.
చిక్కుల్లో నారాయణస్వామి..!
మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మద్యం పాలసీలో బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా పోయింది. నాసిరకం మద్యమే ప్రజలు తాగాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో పెద్ద స్కాం ఉందని అనుమానిస్తున్న ప్రభుత్వం… ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. బెవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై ఇప్పటికే సీఐడీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే సంబంధిత శాఖ చూసిన సీనియర్ నేత నారాయణస్వామి చిక్కుల్లో పడినట్లేనని చెబుతున్నారు.
శ్వేతపత్రాలు విడుదల తర్వాత ముప్పు ఎవరెవరికి?
ఇవి కాకుండా ఆర్థిక రంగంలో అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దిగజార్చేశారని ఆరోపిస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించి నాలుగు శ్వేతపత్రాలను సిద్ధం చేస్తోంది. ఈ పనులను ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అనునిత్యం దీనిపై ఆరా తీస్తున్నారని చెబుతున్నారు. అడ్డగోలుగా అప్పులు చేయడంతోపాటు…. కాంట్రాక్టర్లకు ఇష్టానుసారం బిల్లులు చెల్లించారని, కొన్ని పనులు చేయకుండానే కోట్లు కుమ్మరించారని సందేహిస్తున్న ప్రభుత్వం… పక్కా ఆధారాల సేకరణతో పకడ్బందీ వ్యూహరచనతో అడుగులు వేస్తోంది. ఈ శ్వేతపత్రాలు విడుదల తర్వాత ఎవరెవరికి ముప్పు ఉంటుందనేది విస్తృత చర్చకు దారితీస్తోంది.
బుగ్గన, రోజాలపై చర్యలు?
ముఖ్యంగా ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు ఆ శాఖలో కీలక అధికారులుగా పనిచేసిన వారి పాత్రపై ప్రభుత్వం ఆరా తీస్తోందంటున్నారు. ఇక రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించిన సంబంధిత శాఖ మాజీ మంత్రి రోజా, అనుమతులిచ్చేలా జీవోలు జారీ చేసిన పర్యాటక, మున్సిపల్ అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణానికి భూములు లీజుకివ్వడం, అనుమతి లేకుండా భవనాలను నిర్మించడం వంటివాటిపైనా ఫోకస్ పెట్టింది కూటమి… మొత్తంగా గత ఐదేళ్ల పాలనపై సీఎం చంద్రబాబుతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కూడా కూపీ లాగుతున్నారట..
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు….. పైకి ధీమాగా కనిపిస్తున్నా…. ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
Also Read : అందుకే, ఘోరంగా ఓడిపోయాం..!- దిమ్మతిరిగిపోయే కారణాలు చెబుతున్న వైసీపీ లీడర్లు