వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?

వైసీపీని ఎన్నికల్లో చావు దెబ్బ తీసిన చంద్రబాబు... పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు.

వైసీపీని కోలుకోలేని దెబ్బ తీశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు అనుకున్నది సాధించారా?

Polavaram White Paper : పాలనలో దూకుడు మీదున్న సీఎం చంద్రబాబు… విపక్షాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తున్నారా? పోలవరంపై శ్వేతప్రతం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు గురి కుదిరినట్లేనా? ఐదేళ్లుగా పోలవరం పూర్తిచేస్తామని… ఏటా వాయిదాలు వేసిన వైసీపీ అసలు గుట్టు విప్పేశారా? ఇక తన చేయాల్సిన పనులేమింటో చెబుతూనే.. తన నిర్ణయాలను ప్రశ్నించలేని స్థితికి విపక్షాన్ని నెట్టేశారా? పోలవరం శ్వేతపత్రంతో చంద్రబాబు సాధించిందేంటి?

విపక్ష వైసీపీని కార్నర్‌ చేయడంలో సక్సెస్‌..
అధికారంలోకి వచ్చిన వెంటనే గత ఐదేళ్ల పాలనపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు… తొలి వైట్‌పేపర్‌ను రిలీజ్‌ చేశారు. తన మానసపుత్రిక పోలవరం నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని ప్రకటించిన చంద్రబాబు… తొలి శ్వేతపత్రాన్ని కూడా పోలవరంపైనే విడుదల చేశారు. ఈ శ్వేత పత్రం ద్వారా గత ఐదేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన పనులను సచిత్రంగా, సమగ్రంగా ఆవిష్కరించారు చంద్రబాబు. 2014 నుంచి 2019 వరకు ఏ పని జరిగింది, ఎప్పుడు ఏం చేసింది? ఎంత ఖర్చు చేసిందీ పక్కాగా వివరించారు సీఎం. ఇక 2019 నుంచి 2024 వరకు వైసీపీ హయాంలో జరిగిన పనులను బయటపెట్టారు. పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి కారణమేంటో సమగ్రంగా విశ్లేషించిన చంద్రబాబు… విపక్ష వైసీపీని కార్నర్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారు.

ప్రతిపక్షాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసిన సీఎం..
శ్వేతపత్రంతో జగన్‌ ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టిన చంద్రబాబు… ఇప్పుడేం చేస్తారు? అన్నదే ఆసక్తికరంగా మారింది. తమ హయాంలో 72 శాతం పనులు చేయడమే కాకుండా, 24 గంటల్లో 32 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేసి గిన్నీస్‌ బుక్‌ రికార్డుల్లో పోలవరం పేరును నమోదు చేస్తే… గత ప్రభుత్వం ఏకంగా ప్రాజెక్టు మనుగడనే ప్రశ్నార్థకం మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బాబు. పోలవరం ప్రాజెక్టు ఎవరికీ అంతు చిక్కనిదని, తనకు కూడా ఏమీ అర్థం కాలేదని వ్యాఖ్యానించిన మాజీ నీటిపారుదల మంత్రి అంబటి వ్యాఖ్యలతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఎప్పటికప్పుడు పోలవరంపై చేసిన ప్రకటనల వీడియో రికార్డింగ్‌ను చూపించారు చంద్రబాబు. ఇలా చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలవరం పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్ల సమయం?
2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన నుంచి 2024లో ఎన్నికల్లో ఓడిపోయే వరకు పోలవరం విషయంలో ఎప్పుడు ఏం జరిగిందీ వివరించారు చంద్రబాబు. జగన్‌ ప్రభుత్వం వల్ల పోలవరం నాలుగు విధాలుగా నష్టపోయిందని, కోట్ల రూపాయల ప్రజాధనం నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కరిగిపోయిన కాలం తిరిగి తేలేమని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో నాలుగు సీజన్లు అయినా పట్టే అవకాశం ఉందని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అంటే పోలవరం పూర్తి చేయడానికి కనీసం నాలుగేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తేల్చి చెప్పినట్లైంది. 2019 వరకు జరిగిన పనులు… గత ఐదేళ్ల మధ్య జరిగిన పనుల వ్యత్యాసం స్పష్టంగా వివరించిన చంద్రబాబు… వైసీపీ హయాంలో ఏమీ చేయలేదని… పోలవరంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు తయారైందని చెప్పడంలో సక్సెస్‌ అయ్యారనే అంటున్నారు పరిశీలకులు.

పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా..
వైసీపీని ఎన్నికల్లో చావు దెబ్బ తీసిన చంద్రబాబు… పాలనలోనూ వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి శ్వేతపత్రాలను అస్త్రాలుగా ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, అప్పటివరకు ఉన్న ప్రభుత్వంలో జరిగిన పనులను ప్రజలకు వివరిస్తుంటారు. తన హయాంలో చేయబోయే పనులను చెబుతుంటారు. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగిస్తున్నా… శ్వేతపత్రాల విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నారంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు పాలన, అభివృద్ధి మొత్తం సంస్కరించాల్సిన పరిస్థితి ఎదురైందని… వైసీపీకి ఏదీ చేతకాలేదని చెప్పేందుకు వైట్‌ పేపర్‌ అస్త్రాన్ని సమర్థంగా వాడుకుంటున్నారు చంద్రబాబు.

శ్వేతాస్త్రాన్నికి వైసీపీ నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారో?
ఇప్పటికే ఘోర ఓటమితో ఇళ్లకే పరిమితమైన వైసీపీ నేతలు… చంద్రబాబు ప్రవేశపెడుతున్న శ్వేతపత్రాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సివుంది. పోలవరం ప్రాజెక్టుపై తనకు అవగాహన లేదని ప్రకటించి ఇప్పటికే సెల్ఫ్‌గోల్‌ చేసుకున్న మాజీ మంత్రి అంబటి…. బుల్లెట్‌ దిగిందా? లేదా? అంటూ ఎకసక్కాలాడిన మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌… కూటమి సంధించిన శ్వేతాస్త్రాన్నికి ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read : ఆయనకు పవన్ కల్యాణ్ అండ, ఈయనకు బాలకృష్ణ మద్దతు..! కాబోయే ఎమ్మెల్సీలు వీరేనా?