ఆయనకు పవన్ కల్యాణ్ అండ, ఈయనకు బాలకృష్ణ మద్దతు..! కాబోయే ఎమ్మెల్సీలు వీరేనా?

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. మరీ వీరిలో ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టవంతులు ఎవరు?

ఆయనకు పవన్ కల్యాణ్ అండ, ఈయనకు బాలకృష్ణ మద్దతు..! కాబోయే ఎమ్మెల్సీలు వీరేనా?

Gossip Garage : ఏపీలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. తిరుగులేని విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమికి మరో విజయం సొంతం చేసుకోడానికి రెడీ అవుతోంది. గెలుపు పక్కా అని అందరికీ తెలిసినా, గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు అన్నదే సస్పెన్స్‌గా మారింది. కూటమిలోని మూడు పార్టీల్లో చాలా మంది సీనియర్లు ఎమ్మెల్యే ఎన్నికల్లో చాన్స్‌ దక్కక ఖాళీగా ఉన్నారు. అధినేతల హామీతో నామినేటెడ్‌ పదవులతోపాటు ఎమ్మెల్సీ స్థానాలను ఆశిస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదుల సంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు. మరీ వీరిలో ఎమ్మెల్సీలు అయ్యే అదృష్టవంతులు ఎవరు?

ఎమ్మెల్సీ పదవులు దక్కేది ఎవరికి?
శాసనసభ్యుల కోటా శాసనమండలి సభ్యుల ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే నెల రెండు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అదే నెల 12న ఎమ్మెల్సీల ఎన్నిక జరగనుంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్‌ రాజీనామాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. రెండేళ్ల కాలపరిమితి ఉన్న ఈ పదవులు టీడీపీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సభలో టీడీపీ కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేల కోటాలో సులువుగా ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. ఐతే ఈ రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారనేదే కూటమి పార్టీల మధ్య విస్తృత చర్చకు దారితీస్తోంది.

రెండేళ్ల పదవీ కాలంతో వర్మ సరిపెట్టుకుంటారా?
కూటమిలో టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నుంచి చాలామంది ఎమ్మెల్సీ పదవులను ఆశిస్తున్నారు. అయితే తొలి చాన్స్‌ తమకే ఇవ్వాలని కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ నేతలు కోరుతున్నారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగాలు చేసిన పలువురు నేతలు ఎమ్మెల్సీలుగా చట్టసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఐతే ఎన్నికల సమయంలో కొద్దిమందికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కలిసి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీలిచ్చారు. ఈ లిస్టులో ఫస్ట్‌ పేరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ వర్మ పేరు వినిపిస్తోంది. కానీ, రెండేళ్ల పదవీకాలంతో వర్మ సరిపెట్టుకుంటారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇక్బాల్‌ను కంటిన్యూ చేయాలని బాలయ్య సూచన..
ఇక పదవులు వదులుకుని పార్టీలో చేరిన సి.రామచంద్రయ్య, ఇక్బాల్‌ సైతం మళ్లీ అవే పోస్టులను ఆశిస్తున్నారు. సి.రామచంద్రయ్యకు ఇప్పటికే 75 ఏళ్ల వయసు పైబడటంతో ఆయనకు వేరే పదవి ఇచ్చి.. ఎమ్మెల్సీగా వేరొకరికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇక హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఇక్బాల్‌ను కంటిన్యూ చేయాలని లోకల్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ సూచిస్తున్నట్లు చెబుతున్నారు. మైనార్టీ కావడం, పదవిని త్యాగం చేసి బాలకృష్ణ హ్యాట్రిక్‌ విజయం కోసం ఇక్బాల్‌ పని చేయడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.

వర్మకు తక్షణం న్యాయం చేయాలని బాబు, పవన్ నిర్ణయం..!
ప్రస్తుతం శాసనమండలిలో వైపీపీకే బలం ఎక్కువగా ఉంది. దీంతో సమర్థులైన నేతలను శాసన మండలికి పంపాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. వర్మ, ఇక్బాల్‌ పేర్లతోపాటు మరికొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ గెలుపునకు నిస్వార్థంగా పనిచేసిన వర్మకు తక్షణం న్యాయం చేయాలని చంద్రబాబుతోపాటు పవన్‌ కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి అవకాశం ఇవ్వడం ద్వారా వర్మకు సముచిత గౌరవం ఇచ్చినట్లు అవుతుందనే వాదన వినిపిస్తోంది.

మంత్రివర్గంలో ఓ పదవి ఉమ కోసమేనా?
అయితే ఇదే సమయంలో పార్టీలో సీనియర్‌ నేతలైన మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ తమ ఎమ్మెల్యే స్థానాలను వదులుకుని పార్టీ కోసం పనిచేశారు. ఉమా ఈసారి పోటీ చేసి గెలిస్తే, కచ్చితంగా మంత్రి అయ్యేవారు. ఇప్పుడు మంత్రివర్గంలో ఓ పదవిని రిజర్వు చేయడం కూడా ఆయన కోసమేనని టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ పదవికి గట్టి పోటీదారుగా ఉమా పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన కోవిలమూడి రవీంద్ర, జంగా కృష్ణమూర్తి, కొమ్మాలపాటి శ్రీధర్‌ సైతం ఎమ్మెల్సీ చాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

మరోవైపు ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో విజయనగరం టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్‌చార్జి గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయి. గండి బాబ్జీకి ఎంపీ శ్రీభరత్‌ అండదండలు ఉన్నాయి. ఇదే సమయంలో యువనేత నారా లోకేశ్‌ మద్దతుతో సీనియర్‌ నేత పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మంతిన సత్యానారాయణరాజు, బీదా రవిచంద్ర, బుద్దా వెంకన్న వంటి వారు ఎమ్మెల్సీలుగా తమ పేర్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు.

ఆ ఇద్దరికే అవకాశాలు ఎక్కువ?
సీఎం చంద్రబాబు కుటుంబానికి విధేయుడిగా బుద్దా వెంకన్న.. తనకు తప్పక అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు రేసులో ఉన్నామని చెబుతున్నారు. దీంతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోందంటున్నారు. కానీ, డిప్యూటీ సీఎం పవన్‌ సూచనతో వర్మ, బాలయ్య మద్దతుతో ఇక్బాల్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుందన్నదే సస్పెన్స్‌గా మారింది.

Also Read : వైసీపీకి న‌టుడు అలీ రాజీనామా.. ఇక‌పై నా దారి ఇదే..