మందుబాబులకు గుడ్ న్యూస్..! ఏపీలో అందుబాటులోకి రానున్న బ్రాండెడ్ మద్యం..!

ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తోంది ప్రభుత్వం.

మందుబాబులకు గుడ్ న్యూస్..! ఏపీలో అందుబాటులోకి రానున్న బ్రాండెడ్ మద్యం..!

AP New Liquor Policy : ఏపీలో కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ కు అప్పగించడమా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది. గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు, కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది. అంతేకాకుండా గత ఐదేళ్లలో మద్యం అమ్మకాలు, కొనుగోళ్లపై శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధం అవుతోందని తెలుస్తోంది.

గత సర్కార్ అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని, వేల కోట్ల స్కామ్ జరిగిందని అనుమానిస్తోంది ప్రభుత్వం. నాసిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగా బ్రాండెడ్ మద్యం లేకుండా చేయడమే కాకుండా అస్మదీయుల డిస్టలరీలలో తయారైన మద్యం విక్రయానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారని అనుమానిస్తోంది ప్రభుత్వం. ఏపీ బెవరేజస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి ఇంట్లో చేసిన సోదాల్లోనూ కొన్ని కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.

ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసిన మద్యం విధానంపై సమగ్ర విచారణ జరిపి చక్కదిద్దాలని భావిస్తోంది కొత్త ప్రభుత్వం. గత ఐదేళ్లలో ఏపీలో లక్ష 24వేల 312 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగినట్లు ఒక అంచనా. అందులో గత ఆర్థిక సంవత్సరంలోనే 30వేల 78కోట్ల సేల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకు 2వేల 506 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్య 75వేల 284 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ డేటా ద్వారా తెలుస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 186.47 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడుపోగా, 2023-24 సంవత్సరంలో 346.69 లక్షల కేసుల విక్రయం జరిగినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో 2వేల 934 లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో.. ఒకవైపు మద్యం అమ్మకాలు, అవకతవకలపై ఆరా తీస్తున్నారు అధికారులు. మరోవైపు కొత్త పాలసీ రూపొందిస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. ప్రస్తుత విధానంలో ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తోంది. ఇందుకోసం షాపులను సైతం అద్దెకు తీసుకుంది. రవాణకు ప్రైవేట్ ఏజెన్సీని నియమించుకుంది. సెప్టెంబర్ వరకు ఈ విధానానికి గడువు ఉంది. అయితే, ప్రభుత్వం మారడంతో గడువుకు ముందే కొత్త పాలసీ తెస్తారా? లేక గడువు తీరే వరకు వేచి చూస్తారా? నెక్ట్స్ ఏం చేస్తారు? అని చూడాలి.

Also Read : లోకేశ్ రెడ్ బుక్.. తీవ్ర భయాందోళనలో ఆ అధికారులు..!