ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన హరిప్రసాద్, సి రామచంద్రయ్య
అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు.

Ramachandraiah and Hariprasad
MLA Quota In Assembly : అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హరిప్రసాద్, సి. రామచంద్రయ్యలు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి. రామచంద్రయ్య, షేక్. మహ్మద్ ఇక్బాల్ వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు. దీంతో ఇక్బాల్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడింది. దీంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నిక జరగనుంది. దీంతో టీడీపీ నేత రామచంద్రయ్యకు ఎన్డీయే కూటమి మరోసారి అవకాశం కల్పించింది. జనసేన నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి. హరిప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో వారు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Also Read : సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి యనమల లేఖ.. కీలక విషయాలు ప్రస్తావన
ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన పార్టీ అభ్యర్థి హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు.. పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు వచ్చాను. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటాను. పవన్ కళ్యాణ్ సూచనకు అంగీకరించిన చంద్రబాబు, లోకేశ్ కు హరిప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయుడిగా అనేక సమస్యలమీద పరోక్షంగా పోరాటం చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. మండలిలో జనసేన తరఫున మొదటిసారి అడుగుపెడుతున్నాను. ఎమ్మెల్సీ గా నాకు అవకాశ రావడం సంతోషంగా ఉంది. మండలిలో అర్థమంతమైన చర్చలు సాగేలా నా వంతు ప్రయత్నిస్తానని హరిప్రసాద్ అన్నారు.
Also Read : కుప్పంలో చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం తీసుకున్న అధికారి.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
టీడీపీ తరపున ఎమ్మెల్సీగా సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా బాధ్యతలు మరోసారి అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చాను. కార్యకర్తల సాధకబాధలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా ఉంది. దాన్ని ట్రాక్ పై పెట్టగల వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నాను. ఈ మూడు సంవత్సరాలు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తాను. నా అనుభవం దృష్ట్యా నాకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. నా రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గం గా వ్యవహరించింది. నాపైన కక్ష సాధింపు చేసిందని సి. రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.