Chandrababu Interim Bail : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది.

Chandrababu Interim Bail : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Chandrababu

Updated On : October 31, 2023 / 12:36 PM IST

Skill Development Case : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రిత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తిచేసిన హైకోర్టు.. మంగళవారం తీర్పు వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరుచేస్తూ తీర్పు ఇచ్చారు.

 

నాలుగు వారాలు అంటే.. నవంబర్ 28 వరకూ మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే, చంద్రబాబు ఎవరితో మాట్లాడకూదని, హాస్పటల్ లోనే ఉండాలని, 28వ తేదీ సాయంత్రం సరెండర్ అవ్వాలని నిబంధనలతో కూడిన మధ్యంతర బెయిల్ ను రూ. లక్ష పూచీకత్తు, రెండు షూరిటీలతో హైకోర్టు మంజూరు చేసింది. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 52రోజులుగా ఉంటున్న చంద్రబాబుకు ఊరట లభించినట్లయింది. ఇదిలాఉంటే.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు నారా లోకేశ్, నారా బ్రాహ్మణి రాజమండ్రి చేరుకున్నారు. అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేశ్ వద్ద నాయకులు ప్రస్తావించారు. దీంతో యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యింది అంటూ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

 

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల సమయంలో  జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజమండ్రి నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు. దీంతో రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు వెంట వచ్చేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు ప్రతి జిల్లా నుంచి రాజమహేంద్ర వరంకు టీడీపీ నేతలు భారీ సంఖ్యలో యలుదేరుతున్నారు.