High Temperatures : వామ్మో.. రాజమండ్రిలో 49, కొత్తగూడెంలో 47 డిగ్రీలు.. అగ్నిగుండంలా తెలుగు రాష్ట్రాలు
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.

Heat Wave
Heat Wave : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఓవైపు ఎండ వేడి, మరోవైపు ఉక్కపోత, ఇంకోవైపు వడగాల్పులు.. జనాలు విలవిలలాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. ఇవేం ఎండలు రా నాయనా.. అని నిట్టూరుస్తున్నారు.
ఇక ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. రాజమండ్రి అగ్నిగుండంగా మారింది. అక్కడ ఏకంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ దెబ్బకి జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. కాగా, మరికొన్ని రోజులు ఎండలు ఇలానే మండిపోతాయని, రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చేసిన హెచ్చరికలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
వారం రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకు జనం ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
ప్రాంతాల వారీగా ఉష్ణోగ్రతల వివరాలు..
* ఏపీ, తెలంగాణలో పలు చోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత.
* కొత్తగూడెం 47 డిగ్రీలు.
* ఖమ్మం 46 డిగ్రీలు.
* నల్గొండ 45 డిగ్రీలు.
* మహబూబాబాద్ 46 డిగ్రీలు.
* వరంగల్ 44 డిగ్రీలు.
* ఆదిలాబాద్ 43 డిగ్రీలు.
* కరీంనగర్ 43 డిగ్రీలు.
* మెదక్ 42 డిగ్రీలు.
* హైదరాబాద్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
* రాజమండ్రిలో 49 డిగ్రీలు.
* రెంటచింతలలో(గుంటూరు జిల్లా) 48 డిగ్రీలు.
* విజయవాడలో 47 డిగ్రీలు.
* ఒంగోలులో 45 డిగ్రీలు.
* బాపట్ల జిల్లాలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
* శ్రీకాకుళంలో 41 డిగ్రీలు.
* విజయనగరంలో 43 డిగ్రీలు.
* విశాఖలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
* నెల్లూరు 44 డిగ్రీలు, కర్నూలు 42 డిగ్రీలు, అనంతపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.