రాజకీయాలకు పనికి రారని తిట్టారు, జనసేన మూసేయాలని విమర్శించారు.. కట్ చేస్తే..

పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్.

రాజకీయాలకు పనికి రారని తిట్టారు, జనసేన మూసేయాలని విమర్శించారు.. కట్ చేస్తే..

Pawan Kalyan : 2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్‌పై వచ్చినన్ని విమర్శలు, ఆయనకు ఎదురైనన్ని పరాభవాలు బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ నేతకూ కలిగి ఉండకపోవచ్చు. సోషల్ మీడియాలో అదే పనిగా పవన్‌పై ట్రోల్స్ జరిగాయి. రాజకీయాలకు పనికిరారని, జనసేన మూసివేయాలని ఉచిత సలహాలు అందాయి. కానీ పవన్ ఇలాంటి విమర్శలకు భయపడలేదు. అవమానాలకు కుంగిపోలేదు. తనను మాత్రమే తాను నమ్మి ముందుకు సాగారు. హేళన చేసిన నోళ్లే ప్రశంసలు కురిపించేలా చేసుకున్నారు. మొత్తంగా 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ పవన్ ప్రభావం కనిపిస్తోంది.

జనసేన మరో ప్రజారాజ్యమని ట్రోల్స్..
పవన్ 2014లో జనసేన స్థాపించే నాటికి… ఆయనపై పెద్దగా ఎవరికీ అంచనాలు లేవు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పుడు తెలివైన నిర్ణయం తీసుకున్నారు పవన్. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ గెలుపుకు పవన్ మద్దతు ఉపయోగపడింది. అయితే 2019 ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. టీడీపీకి, బీజేపీకి ఆయన దూరం జరిగారు. జనసేన.. కొత్త మిత్రులతో కలిసి పోటీ చేసి ఘోర పరాభవం మూటగట్టుకుంది. పవన్ స్వయంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి పవన్ అనేక రకాల విమర్శలు ఎదుర్కొన్నారు. పవన్‌ను చూడడానికి జనాలు వస్తారు కానీ జనసేనకు ఓటేయరని, పవన్ అభిమానులంతా, ఆయన ఓటర్లు కాదని… ఇక పవన్ కల్యాణ్ కూడా అన్న చిరంజీవి బాటలో జనసేనను మూసివేయాలని, జనసేన మరో ప్రజారాజ్యమని ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు ట్రోల్స్ చేశారు. వాటన్నింటినీ మౌనంగా భరించిన పవన్ సమయం కోసం ఎదురుచూశారు.

పవన్ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు..
సొంతంగా పోటీ చేయడం, సంస్థాగత బలం లేకపోవడం, రాజకీయాల్లో ఖర్చు చేయడానికి సరిపడా డబ్బులు లేకపోవడం వంటివి జనసేన ఓటమికి కారణమని గ్రహించిన పవన్ తెలివిగా వ్యూహాలు రచించారు. అమరావతి వివాదం మొదలుకాగానే.. రాజధానికి విస్పష్ట మద్దతు ప్రకటించడం ద్వారా తన వైఖరిని తెలియచేశారు. ఆ తర్వాత వైసీసీ ప్రభుత్వంపై విమర్శలు పెంచుతూ ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లగా మార్చడానికి, ఆ ఓట్లు చీలకుండా ఒకే చోట పడడానికి తగిన వ్యూహాలు రచించారు. నిప్పుఉప్పుగా ఉన్న టీడీపీ, బీజేపీని ఒకే కూటమిలోకి తీసుకురావడం అసాధ్యమన్న అభిప్రాయాన్ని మార్చివేశారు. పవన్ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నిరూపించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన తర్వాత పొత్తు ప్రకటన చేస్తూ…. బీజేపీ కూడా తమతోనే వస్తుందని కుండబద్ధలు కొట్టి చెప్పిన తెగువ అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ తర్వాత రోజుల్లో అదే నిజమైంది.

3 పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేయడంలో కీలక పాత్ర..
పొత్తును వ్యతిరేకిస్తున్న వారికి, తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని ఆరోపణలు చేసిన వారికి, పొత్తును చిత్తు చేయాలని చూసిన వారికి తన మాటలతోనే కాక అసాధారణ పరిణితితోనూ సమాధానమిచ్చారు పవన్. జనసేనకు సంస్థాగత బలం లేదన్న పవన్.. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది ముఖ్యం కాదని.. పోటీ చేసిన సీట్లన్నింటిలోనూ గెలవడం ముఖ్యమని చెప్పడం ద్వారా తానెంత స్పష్టమైన వైఖరితో ఉన్నానో క్యాడర్‌కు వివరించి.. వారిని ఒప్పించగలిగారు. ఎన్నికల నాటికి మూడు పార్టీల కార్యకర్తలు ఒకే పార్టీ కార్యర్తల్లా కలిసిమెలిసి పని చేయడంలో పవన్‌ది కీలక పాత్ర. అలాగే తన సభలకు వచ్చి చప్పట్లు కొట్టి ఓట్లు వేయకపోవడంపైనా పవన్ నిర్మొహమాటంగానే తన అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే జనసేనకు నష్టమే తప్ప లాభం లేదని విమర్శకుల నోళ్లు మూయించారు.

Also Read : దటీజ్ పవన్ కల్యాణ్.. దారుణ ఓటమిని విజయంగా మార్చుకున్న జనసేనాని