Tirumala Rush : తిరుమలలో విపరీతమైన రద్దీ, భక్తుల కష్టాలు.. 24గంటల తర్వాతే దర్శనం
Tirumala Rush : టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 24 గంటల తర్వాతే దర్శనం కలుగుతోంది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు.

Tirumala Rush
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. వరుస సెలవులు దానికి తోడు వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. కొండపై ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపల ఎంబీసీ వరకు బారులు తీరారు.
ఇక, టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 24 గంటల తర్వాతే దర్శనం కలుగుతోంది. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో వసతి గదులు దొరక్క భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసతి గదుల దొరకడం గగనంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులకు వసతి గదుల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పడం లేదు. ఐదారు గంటల పాటు క్యూలైన్ లో వేచి ఉంటే తప్ప.. గదులు దొరకని పరిస్థితి నెలకొంది. గదులు దొరకని భక్తులు సీఆర్ వో కార్యాలయం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు క్యూలైన్లలోని భక్తులకు అన్న ప్రసాదం అందిస్తోంది టీటీడీ.
Also Read..Tirumala : తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు.. మూడేళ్ల తర్వాత పున:ప్రారంభం
ఇక భక్తుల అధిక రద్దీ కారణంగా టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, దివ్య దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని కోరింది. శ్రీవారి సేవకులు అన్ని కీలక ప్రదేశాల్లో సేవలు అందిస్తున్నారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం అందజేస్తున్నారు.