ఏపీలో రాజధానుల రచ్చ.. హైదరాబాద్‌లో రియల్టర్లు హ్యాపీ!

ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసినా.. ఏపీ రాజధానుల విషయమే చర్చించుకుంటున్నారు. అక్కడి రాజధానులతో వీళ్లకేంటి పని అనే కదా మీ డౌట్? మరి వ్యాపారం అంటే అదే. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి ఢోకా లేకున్నా.. ఏపీలో రాజధానుల లొల్లితో తమకు వ్యాపారపరంగా వరంగా మారుతుందన్నది వీరి అంచనా.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పుడు.. ఇక్కడ చాలామంది బడా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతికి తరలిపోయారు. అయితే, జగన్ సీఎం అయ్యాక అమరావతిని పక్కన బెడుతున్నారన్న వార్తలు రావడం.. ఇప్పుడు ఏకంగా మూడు రాజధానులు ఖాయమని తేలడంతో అంతా వెనక్కు వచ్చేస్తారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
వారి చూపు హైదరాబాద్ వైపు :
అక్కడ వ్యాపారం చేసేవాళ్లు,, కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లందరి చూపు హైదరాబాద్ వైపునకు మళ్లుతుందన్నది వీరి ఉద్దేశమట. ఎందుకంటే హైదరాబాద్‌కు బ్రాండ్ వ్యాల్యూ ఉండటమేనంటున్నారు. ఇక్కడ భవిష్యత్‌లో తమ వ్యాపారానికి ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం ఖాయమని భావిస్తున్నారు. దీనివల్ల హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట రియల్ బూమ్ భారీగా ఉంటుందని లెక్కలేస్తున్నారు ఇక్కడి రియల్ వ్యాపారులు.
ఇక్కడే బిజినెస్ బెటర్ :
మరోపక్క ఇక్కడి ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యంతో.. ఏపీ వ్యాపారులు సైతం అక్కడి కంటే ఇక్కడనే బిజినెస్ బెటర్ అనే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు ఇక్కడి నుంచి కర్నూలు దగ్గరగా ఉండటం, ఇక అమరావతి, విశాఖలను విమాన రాకపోకలు దగ్గర చేస్తుండటంతోపాటు రాజకీయ నాయకులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఇక్కడే ఉంటారని అంటున్నారు.
ఇవన్నీ కూడా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవడానికి దోహదపడతాయన్నది రియల్ వ్యాపారుల లెక్క. ఇక ఇప్పటికే మినీ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ వ్యాల్యూ ఉండటం, భాష పరంగా, వాతావరణం కారణంగా అనువుగా ఉండటంతో వ్యాపారం బాగా సాగుతుందని అంటున్నారు. ఇప్పుడు ఏపీ ఎపిసోడ్‌తో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింత పండగే అని సంబరాలు చేసుకుంటున్నారట.