AP Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఇవాళ, రేపు ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో

AP Rains: అరేబియా సముద్రంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉపరిత ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది.
కొద్దిరోజులుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ (బుధవారం) తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, బీ.ఆర్. అబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈనెల 24వ తేదీ నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయని, అందుకు వాతావరణం అనుకూలంగా ఉందని ఐఎండీ తెలిపింది. ఈనెల 26 నాటికి రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈసారి అంచనాలకు అనుగుణంగా ఈ నెల 24వ తేదీ నాటికి కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే 2009 తరువాత అత్యంత వేగంగా రావడం ఇదే తొలిసారి కానుంది.
మరోవైపు వాతావరణం చల్లబడటంతో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత తగ్గింది. కొద్దిరోజుల క్రితం వరకు ఏపీలో 40డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎండవేడిమి, ఉక్కుపోతకు ప్రజలకు బయటకు రావాలంటేనే భయపడిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వచ్చే రెండు రోజులు ఏపీలో 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. రోజంతా మేఘాలు ఉండటం వల్ల వేడి తక్కువగా ఉంటుంది. కానీ, గాలి లేనప్పుడు ఉక్కపోతగా ఉంటుంది.