అక్టోబరు 15నుంచి కాలేజీలు ఓపెన్ చేయాలి: సీఎం జగన్

సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని.. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
దీంతో పాటుగా తీసుకున్న పలు నిర్ణయాల వివరాలిలా ఉన్నాయి:
* గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలి
* మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో పది నెలల పాటు అప్రెంటిస్‌షిప్
* ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన
* ఇవన్నీ నేర్చుకున్న వారికే హానర్స్ డిగ్రీ
* యూనివర్శిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్
* పాడేరులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
* కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలి
ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు కార్యక్రమానికి హాజరు అయ్యారు. సీఎం ప్రణాళికలపై ఆలోచనలు, దార్శినికత నూతన విద్యా విధానంలో కనిపిస్తుందంటూ కొనియాడారు.
కార్యక్రమంలో మాట్లాడిన సీఎం ”ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నాం. కచ్చితంగా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరగాలి. ఇప్పుడున్న 32.4 శాతం నుంచి దాన్ని 90 శాతానికి తీసుకెళ్లాలి. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలి. డిగ్రీ కోర్సులో అప్రెంటిస్ చేర్చాం. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చాం. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుంది. దాన్ని డిగ్రీ హానర్స్‌గా పరిగణిస్తాం”
”వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్ ఉంటుంది. అదనంగా 20 అడిషనల్ క్రెడిట్స్ సాధించేవారికి కూడా హానర్స్ డిగ్రీ ఇవ్వాలి. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా హానర్స్ డిగ్రీ కావాలా? అనే దానిని సెలక్ట్ చేసుకోవాలి. చదువులు చెప్పే విధానంలో మార్పులు రావాలి. మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుంది.
పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు–నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం విద్యా రంగం మీద దృష్టి పెట్టింది కాబట్టి .. వీటి గురించి ఆలోచిస్తున్నాం’ అని సీఎం అన్నారు.
తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టే దిశగా పనులు మొదలుపెట్టాలన్నారు. ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.