నెల్లూరులో మరో కీలక నేతకు బిగుస్తోన్న ఉచ్చు..! కాకాణి తర్వాత నెల్లూరులో నెక్స్ట్ అనిల్ కుమార్ వంతేనా?
టైమ్ చూసి..అన్ని ఆధారాలు దొరికినప్పుడు ఏదో ఒక కేసులో అనిల్‌కుమార్‌ను రౌండప్ చేస్తారని కూటమి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది.

Anil kumar yadav
నెల్లూరులో మరో వైసీపీ కీలక నేత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కూటమి హిట్ లిస్ట్‌లో ఉన్న లీడర్లలో మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కూడా ఒకరని టీడీపీ నేతలు ఆఫ్ ది రికార్డులో చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓడినప్పటి నుంచి నెల్లూరుకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటున్నారు అనిల్‌కుమార్ యాదవ్. అయితే లేటెస్ట్‌గా మైనింగ్ కేసులో అనిల్‌కుమార్‌కు ఉచ్చు బిగిసేలా కనిపిస్తోంది. క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలతో వందల కోట్లు పోగేశారని ఆరోపిస్తూ నెల్లూరుకు చెందిన వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
రుస్తుం మైన్స్ తవ్వకాల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ఇక వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఉచ్చు బిగిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకుంటే నెల్లూరులోని ముఖ్యమైన ఇద్దరు నేతలు ఇరుక్కున్నట్లేనని అంటున్నారు.
Also Read: ఆమె అసంతృప్తి బావబామ్మర్దులను దగ్గర చేసిందా? క్యాడర్‌లో జోష్ నింపేలా..
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలతో సంపాదించిన సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు శ్రీకాంత్ రెడ్డి విచారణలో చెప్పారంటున్నారు. లీజు గడువు ముగిసినా రుస్తుం మైన్ నుంచి క్వార్ట్స్ తీశామని..మాజీ మంత్రి కాకాణి, అనిల్ కుమార్ యాదవ్ అండతో గూడూరు, సైదాపురం, చిల్లకూరు, వెంకటగిరి ప్రాంతాల్లో మామూళ్లు వసూలు చేశామని శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారట.
టన్ను క్వార్ట్జ్‌కు రూ.7వేలు-రూ.10 వేలు మధ్య వసూలు?
టన్ను క్వార్ట్జ్‌కు రూ.7వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలిందని చెబుతున్నారు. మైనింగ్ ద్వారా వసూలు చేసిన డబ్బుతో భారీగా భూములు కొని,వందల ఎకరాల భూమిలో రియల్ వెంచర్లు వేశారనే అలిగేషన్ ఉంది. అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కాకాణి 2 నెలలుగా రిమాండ్లో ఉన్నారు. త్వరలోనే అనిల్‌కుమార్ యాదవ్‌కు అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముందు నుంచి టీడీపీకి టార్గెట్‌గా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. 2014లో టీడీపీ పవర్‌లో ఉన్నప్పుడు అపోజిషన్‌లో ఆయన చేసిన హడావుడి ఒక ఎత్తు అయితే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్‌ను ఉద్దేశించి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూటమి ఇంకా మరిచిపోలేదంటున్నారు.
టైమ్ చూసి..అన్ని ఆధారాలు దొరికినప్పుడు ఏదో ఒక కేసులో అనిల్‌కుమార్‌ను రౌండప్ చేస్తారని కూటమి పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీకాంత్‌రెడ్డి అరెస్ట్‌తో అనిల్ కుమార్ వసూళ్ల దందా..అక్రమ మైనింగ్ వ్యాపారం మొత్తం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. పక్కా ఆధారాలు దొరికాయని..శ్రీకాంత్‌రెడ్డి వాంగ్మూలంతో అనిల్‌కుమార్ ఇరికిపోవడం పక్కా అన్న ప్రచారం బయలుదేరింది. ఈనేపథ్యంలోనే ఈ వీకెండ్‌లో అనిల్‌కుమార్ అరెస్ట్ ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో చూడాలి మరి.