Vijayasai Reddy: రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి రీ ఎంట్రీ నిజమేనా?
గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాలపై తాను సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి సంకేతాలివ్వడం..ఇవన్నీ తాను బీజేపీలో చేరేందుకు చేస్తున్న వ్యూహాల్లో భాగమే అన్న చర్చ నడుస్తోంది.

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దారెటు? రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పినానని ప్రకటించిన విజయసాయి…యూటర్న్ తీసుకొని తిరిగి పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తారా? ఒకవేళ రీ ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరతారు? కూటమిలోకి చేరి తిరిగి రాజ్యసభకు పోటీ చేస్తారా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాజ్యసభకు ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో విజయసాయిరెడ్డి పొలిటికల్ కెరీర్ పై నెలకొన్న సస్పెన్స్ కు తెరపడనుందా? వాచ్ దిస్ స్టోరీ.
రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్వయంగా ప్రకటించి వైసీపీకి రాజీనామా చేసిన ఆపార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ పునరాగమనంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్న విజయసాయిరెడ్డి ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు.
అయితే విజయసాయిరెడ్డి ఇన్నాళ్లూ పొలిటికల్ కెరియర్ పై ఆడిన దోబూచులాటకు అతి త్వరలోనే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వచ్చే మే నెల 9న ఎన్నిక నిర్వహిస్తారు.
దీంతో విజయసాయిరెడ్డి..రాజ్యసభ సస్పెన్స్ ఎపిసోడ్ విషయంలో ఓ స్పష్టత రానుంది. ఎందుకంటే వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పినా బీజేపీ నుంచి ఆయన కచ్చితంగా రాజ్యసభకు వెళ్తారనే టాక్ రాజకీయవర్గాల్లో తెగ జరుగుతోంది. ఇటీవల కొద్ది రోజుల క్రితం మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇదే తరహాలో కామెంట్ చేయడంతో మరింత ఆసక్తికరంగా మారింది.
Also Read: అందుకే.. ఆ ముగ్గురు సీఎల్పీ భేటీకి డుమ్మా కొట్టారా?
ఈ విషయమై ఇప్పటి వరకు బీజేపీ మాత్రం ఎలాంటి ప్రకటనగానీ..మాటగానీ మాట్లాడలేదు. కానీ కమలం పార్టీలో కూడా ఇవే తరహా గుసగుసలు, చర్చలు తెగ వినిపిస్తున్నాయంట. దీంతో సాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లడం ఖాయమనే టాకే చాలా మందిలో వ్యక్తమవుతోందట. వాస్తవానికి వైసీపీకి రాజీనామా చేసిన సమయంలోనే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన అప్పట్లో ఆ ప్రచారాన్ని ఖండించారు.
బీజేపీ ప్లాన్ ఏంటి?
దక్షిణ భారతదేశంలో బలపడాలని చూస్తున్న బీజేపీ.. ఏపీలో వీలైనంత ఎక్కువ మందిని సమీకరించుకోవాలని ప్లాన్ చేస్తోందన్న టాక్ నడుస్తోంది. దీంతో విజయసాయిరెడ్డిని బీజేపీలో చేర్చుకుని ఆయన రాజీనామా చేసిన స్థానం నుంచే మళ్లీ రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోందన్న టాక్ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఆయనను బీజేపీలో చేర్చుకుని ఏపీలో వైసీపీ అసమ్మతి నేతలను పార్టీలోకి లాగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట.
అంతేకాదు..ఈ ప్రాంతంలో పలుకుబడి ఉన్న నేతలను పార్టీలో చేర్చుకుని వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పోటీదారుగా అవతరించాలని కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే టీడీపీని, జనసేనను విపరీతంగా విమర్శించిన సాయిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని బీజేపీ చెబితే దానికి కూటమి అధినేత అయిన చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ఓకే చెప్తే బీజేపీ తరపున విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వైసీపీలో ఉండగా, విజయసాయిరెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిపై ఓ పక్క సిట్..మరో పక్క సీఐడి విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కాంలో తనకు సంబంధం లేదని, ఆ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా వైసీపీ నేత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ అప్పట్లోనే పెద్ద బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. ఇలా వైసీపీ నేతలను ఇరికించేలా ప్రకటనలు చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న కుంభకోణాలపై తాను సహకరిస్తానని కూటమి ప్రభుత్వానికి సంకేతాలివ్వడం..ఇవన్నీ తాను బీజేపీలో చేరేందుకు చేస్తున్న వ్యూహాల్లో భాగమే అన్న చర్చ నడుస్తోంది. అయితే ఈనెల 17న మరోసారి సిట్ ముందు విచారణకు హాజరుకాబోతున్న విజయసాయిరెడ్డి విచారణ తర్వాత ఆరోజు ఏ బాంబు పేల్చుతారో అన్న ఉత్కంఠ కూడా ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి యూటర్న్ తీసుకొని యాక్టీవ్ పాలిటిక్స్ లోకి వస్తారా లేదా అన్నది కొద్దిరోజుల్లోనే తేలిపోనుందనే టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది.