బాబు మాజీ పీఏ ఇంటిపై ఐటీ దాడులు

ఏపీ రాష్ట్రంలో ఐటీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది లీడర్స్‌పై ఐటీ అధికారులు దాడులు జరుపుతున్నారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ నివాసానికి 2020, ఫిబ్రవరి 06వ తేదీన ఐటీ అధికారులు ఇంటికి చేరుకున్నారు. అక్కడ సోదాలు చేపట్టారు.
2019 ఎన్నికల ముందు వరకు శ్రీనివాస్.. అప్పటి చంద్రబాబుకు పీఏగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన జీఏడి ఉద్యోగిగా పని చేస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే…టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై కూడా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల దాడులు నిర్వహించడం కలకలం రేపింది. స్థానిక ద్వారకానగర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. టీడీపీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఐటీ దాడులకు రాజకీయ రంగు పులమవద్దని ఇతరులు సూచిస్తున్నారు.