“ఊరుకునేది లేదు” అంటూ వైఎస్‌ జగన్‌కు హోంమంత్రి అనిత వార్నింగ్

"తీర్థయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూసేశాం. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నాం" అని అన్నారు.

“ఊరుకునేది లేదు” అంటూ వైఎస్‌ జగన్‌కు హోంమంత్రి అనిత వార్నింగ్

Updated On : July 31, 2025 / 5:55 PM IST

ప్రస్తుతం వైఎస్ జగన్ జైల్ యాత్రలు జరుగుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత ఎద్దేవా చేశారు. అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. పరామర్శ అని చెప్పి బలప్రదర్శన చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు కష్టపడి దేశాలు పట్టుకు తిరుగుతుంటే.. జగన్ బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ మానసిక పరిస్థితిపై చర్చ జరగాలి. మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తిని జగన్ పరామర్శించడం జుగుప్సాకరం. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాము.

ప్రసన్నకు ప్రశాంతి రెడ్డి చెల్లి అవుతారు. అయినా కూడా చెల్లి వరస అయ్యే మహిళపై నీచాతి నీచంగా మాట్లాడారు. అంటే ప్రసన్న మాటలని జగన్ సమర్థిస్తున్నారా? తల్లి, చెల్లిపై కామెంట్లు చేసినా కూడా నోరు మెదపని పరిస్థితి జగన్‌ది. ఆయన మానసిక పరిస్థితి ఇలా ఉంది. జగన్ యాత్రలు పరమర్శల కోసమా? బల ప్రదర్శన కోసమా? పోలీస్ శాఖకు కూడా జగన్ క్షమాపణలు చెప్పాలి. మీటింగ్ పెడతామంటే పర్మిషన్ ఇస్తాం. పరామర్శకు ఎప్పుడూ జగన్‌కు మేము నో చెప్పలేదు” అని అన్నారు.

“తీర్ధయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు చూసేశాం.. ఇప్పుడు జగన్ జైలు యాత్రలు చూస్తున్నాం. ఓవైపు చంద్రబాబు నాయుడు సింగపూర్ లో తిరుగుతూ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తుంటే జగన్ జైళ్లలోని ఖైదీలను కలుస్తున్నారు. పబ్లిక్ లో మహిళలపై నీచాతి నీచంగా మాట్లాడినప్పడు జగన్ ఎన్నడూ తప్పని ఖండించలేదు.

నారా భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా ఇష్టానుసారం దూషించినా తప్పు అని చెప్పలేదు. ప్రశాంతి రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రసన్న కుమార్ నీచాతి నీచంగా మాట్లాడారు. ఆయన మాటలను జగన్ సమర్థిస్తున్నారు.

తల్లి గురించి, చెల్లిగురించి నీచాతినీచంగా మాట్లాడినా నోరు మెదపని వ్యక్తి జగన్. జగన్ రెడ్డి పరామర్శకు వెళుతున్నారా, బల ప్రదర్శన చేస్తున్నారా? మీరు ఎంతమంది వెళతారో ముందు చెప్పండి దానికి తగ్గట్టు సెక్యూరిటీ ఇస్తారు. పరామర్శ కాదు మీటింగ్ పెడతామంటే దానికి అనుమతి ఇస్తాం.

ఇంత చేసి తిరిగి పోలీసులను చులకన చేసి మాట్లాడతారు. రాప్తాడు, చిత్తూరు బంగారు పాళ్యంలో వేసిన డ్రామాలు అందరూ చూశారు. ఆ రైతులు నేటికి డబ్బు ఇవ్వలేదు. మీ హయాంలో రంగనాయకమ్మ, జర్నలిస్టు అంకబాబు, కిషోర్ కు మీరు చేసింది మర్చిపోయారా?

కోడికత్తి, గులకరాయి వ్యవహరం తరువాత నీఆట ముగిసింది. జగన్ నిజంగా పరామర్శించాలంటే ప్రశాంతి రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించాలి. నీ పార్టీలోని వారు నోటికొచ్చినట్టు మాట్లాడితే కట్టడి చేయలేరా?” అని అనిత అన్నారు.