Pawan Kalyan : తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం : పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాష దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ‘తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం’ అని అన్నారు. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు నిర్వహించాలన్నారు.

Pawan Kalyan : తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan

Updated On : August 29, 2021 / 2:50 PM IST

Telugu Language Day : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు భాష దినోత్సవ శుభాకంక్షలు తెలిపారు. ‘తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం’ అని అన్నారు. ‘సుందర తెలుంగు’..తమిళ కవి బ్రహ్మ సుబ్రహ్మణ్య భారతి నోట జాలువారిన మాట. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ శ్రీకృష్ణ దేవరాయలు ఘంటం నుంచి జాలువారిన అక్షరాలు. కస్తూరి పరిమళాల ఓలే మధుర భాష తెలుగు అన్నారు నండూరి వారు. ఇటాలియన్ అఫ్ ఈస్ట్.. అజంత భాష.. అమర భాష.. ఇంతటి ఘన కీర్తి కలిగిన మన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అల్లుకున్న తెలుగు వారందరికీ తన పక్షాన, జనసేన పార్టీ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వాడుక భాషా పితామహుడు శ్రీ గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమన్నారు. ఈ సందర్భంగా ఆయనకు అంజలి ఘటిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగును వాడుక భాషగా శ్రీ గిడుగు వంటి మహానుభావులు కృషి చేస్తే.. ఈనాటి పాలకులు తెలుగును వాడుక నుంచి కనుమరుగైపోయే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారని విమర్శించారు. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది’ అనే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఓట్ల వ్యామోహంలో కొట్టుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదన్నారు. ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని బాధపడ్డారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదు దశాబ్ధాల్లో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని తెలుగు భాషాభిమానులు వ్యధ చెందుతున్నారని పేర్కొన్నారు.

మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్న పెద్దల మాటలను విస్మరించరాదని తెలిపారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. అందువల్ల మన అమ్మ భాషను బతికించుకోవడానికి తెలుగు వారందరూ నడుం కట్టాలన్నారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలలన్నారు. తెలుగు భాషాభిమానులు, స్వచ్ఛంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని తెలిపారు. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు.

భాషా పరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలన్నారు. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని కాంక్షించారు. పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించినా వారికి తెలుగు నేర్పించడంలో తల్లిదండ్రులు శ్రద్ధవహించాలన్నారు. భాషా పరిరక్షణకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగును బతికించుకుందాం.. తెలుగువారమని సగర్వంగా ప్రకటించుకుందామని చెప్పారు.