నిమ్మగడ్డ ఇంటికి వెళ్లే వరకు ఎన్నికలు జరగవు, వైసీపీ గెలుపు ఖాయం

  • Published By: naveen ,Published On : November 19, 2020 / 03:27 PM IST
నిమ్మగడ్డ ఇంటికి వెళ్లే వరకు ఎన్నికలు జరగవు, వైసీపీ గెలుపు ఖాయం

Updated On : November 19, 2020 / 3:38 PM IST

jc diwakar reddy: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఇంటికి వెళ్లేంతవరకూ ఏపీలో ఎన్నికలు జరగవన్నారు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం అభ్యంతరాలు, కోర్టు కేసులతో ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవన్నారు. ఏపీలో ఓటింగ్‌ జరగదని తేల్చి చెప్పిన జేసీ, ఒకవేళ జరిగినా పోలీసులతో ఓట్లు వేయించి వైసీపీయే గెలుస్తుందన్నారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రగడ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ అంటుంటే.. కరోనా సమయంలో సాధ్యం కాదని ప్రభుత్వం, వైసీపీ అంటోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధమని ఎస్ఈసీ ప్రకటించగా, మళ్లీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కమిషన్ మాత్రమే ఎన్నికలు జరపలేదన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వం కూడా సహకరించాలని.. అధికారులకు డబ్బు సమకూర్చాల్సింది ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని.. సీఎం అనుకున్నది జరగడానికి ఎంత దూరమైనా వెళ్తారన్నారు. ఎన్నికలు జరపకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు.

ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పులువురు మంత్రులు అంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన చర్చ సాగుతుంది.

ఇక, మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం(నవంబర్ 18,2020) రాజ్‌భవన్‌లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ కలిశారు. ఈ సందర్బంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవశ్యకతను, ఎన్నికలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను గవర్నర్‌తో రమేశ్‌కుమార్ చర్చించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే యోచనలో ఎస్‌ఈసీ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.