నయా బాస్ : ఏపీ ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్

రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొత్త బాస్ వచ్చారు. కమిషనర్ గా జస్టిస్ వి.కనగరాజ్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా ఈయన పనిచేశారు.
దాదాపు 9 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన కనగరాజ్..స్టేట్ ఎలక్షన్ కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది సీఎం జగన్ ప్రభుత్వం. ఆర్డినెన్స్ ప్రకారం..ఈయనను నియమించారు. విద్య, బాలలు, మహిళలు, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి వి.కనగరాజ్ కీలక తీర్పులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఏపీ ఎన్నికల అధికారిగా ఉన్న రమేశ్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. ఈ నియామకానికి సంబంధించిన విషయంలో రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనిని గవర్నర్ కు పంపడం..ఆయన వెంటనే ఆమోదించడం..వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఎన్నికల కమిషనర్ విధుల నుంచి రమేశ్ కుమార్ ను తప్పించింది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అని ఆక్షేపిస్తున్నాయి.