Kadaknath chicken : ఆ.. కోడి మాంసం కేజీ ధర రూ.800

మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్‌ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసం మటన్‌తో సమానంగా ధర పలుకుతుంది.

Kadaknath chicken : ఆ.. కోడి మాంసం కేజీ ధర రూ.800

Kadaknath Chicken

Updated On : March 24, 2021 / 3:35 PM IST

Kadaknath chicken price per kg is Rs.800 : మాంసం ప్రియులకు దొరికిన మేలుజాతి వజ్రం కడక్‌నాథ్‌ కోళ్లు. దండిగా పోషకాలు, మెండుగా ఔషధ గుణాలు కలిగిన ఈ కోడి మాంసం మటన్‌తో సమానంగా ధర పలుకుతుంది. అయినప్పటికీ ఆ మాంసాన్ని మాంసాహార ప్రియులు ఇష్టంగా లాగించేస్తున్నారు. కడక్‌నాథ్‌ కోళ్లు కొత్తవేం కావు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ఈ కోడి రుచులు పంచుతోంది.

ఆయా రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా లభ్యమవుతాయి. సాధారణంగా కోళ్లలో బొచ్చు రంగు రంగులుగా ఉన్నప్పటికీ మాంసం మాత్రం ఎరుపుగానే ఉంటుంది. కానీ ఈ కడక్‌నాథ్‌ కోళ్లు మాత్రం బొచ్చుతోపాటు చర్మం, ముక్కు, గోళ్లు, ఎముకలు, చివరికి నాలుక కూడా నలుపుగానే ఉంటుంది. ఈ కోళ్లను మాంసం కోసం పెంచుతారు. వీటి గుడ్లు కాఫీకలర్‌తోపాటు కొంత పింక్‌ కలర్‌లో ఉంటాయి.

కడక్‌నాథ్‌ కోళ్లలో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వు, కొలెస్ట్రాల్‌ శాతం తక్కువగా ఉంటాయి. దీని మాంసం తింటే ఊబకాయం రాదు. ఈ కోడి మాంసంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువేగానే ఉన్నాయి. పోషకాలు రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే కాకుండా శ్వాస సంబంధమైన ఆస్తమా వంటి రోగాలను కూడా నియంత్రిస్తుందట. పురిటి నొప్పులు తగ్గించడంలోనూ మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుందనే ప్రచారం కూడా ఉంది. ఈ ప్రయోజనాలతోపాటు మంచి రుచిగా ఉండడంతో కడక్‌నాథ్‌ చికెన్‌ ధర రూ. 800లు వరకు పలుకుతోంది.

కడక్‌నాథ్‌ కోళ్లు మంచి బరువు తూగేందుకు 8 నెలల సమయం పడుతుంది. సాధారణంగా మార్కెట్‌లో లభించే బ్రాయిలర్‌ కోళ్లు 45 రోజుల్లోనే ఒకింత బరువు పెరుగుతాయి. ఇక్కడే సాధారణ కోడికి, కడక్‌నాథ్‌ కోడికి తేడా ఉంది. కడక్‌నాథ్‌ కోళ్లలో క్వాలిటీ ఉంటుంది. వీటి పెంపకం నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువే. అందుకే దీని ధర అధికంగా ఉంది.

నాటు కోడి మాంసం కంటే చాలా బాగుండటంతో ఈ మాంసం తిన్న తర్వాత బ్రాయిలర్‌ కోడి మాంసం తినాలనిపించడంలేదని శ్రీకాకుళం ప్రాంత వాసులంటున్నారు. ఈ కోడి మాంసం వండిన తర్వాత రుచి చాలా బాగుందని చెబుతున్నారు. కడక్ నాధ్ కోడి మాంసానికి గిరాకీ పెరుగుతుండటంతో ఈ కోళ్ళ పెంపకంపై పలువురు ఫాం నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు.