Kasibugga temple: భక్తుడు తలుచుకుంటే ఏం చేయగలడో నిరూపించిన కురు వృద్ధుడు.. ఇంత గొప్ప ఆలయ నిర్మాణం వెనుక చరిత్ర ఇదే..
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు.
Kasibugga temple: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. కొన్ని గంటల పాటు క్యూలైన్లలో నిలబడినా తనివితీరా స్వామివారి దర్శనం కలగకపోవచ్చు. స్వామివారిని కనులారా దర్శించుకోవడానికి మళ్లీ మళ్లీ వెళ్లే భక్తులు కూడా ఉంటారు.
ఏపీలోని పలాసకు చెందిన హరిముకుంద పండా పన్నెండేళ్ల క్రితం తిరుమలకు వెళ్లారు. స్వామివారి దర్శనం సంతృప్తికరంగా జరగలేదని బాధపడ్డారు. దీంతో ఆయన కుటుంబం తిరుమల లాంటి ఆలయాన్నే పలాసలో నిర్మించాలని సంకల్పించింది. ఏడేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించగా, 2023లో పూర్తయింది. ఇవాళ అదే కాశీబుగ్గలో తొక్కిసలాట జరగడం విషాదకరం. ఈ ఆలయ చరిత్ర చూద్దాం.. (Kasibugga temple)
స్వామిని తనివితీరా దర్శించుకోనివ్వకుండా..
ముకుంద పండాకు ఇప్పుడు 97 ఏళ్లు దాటాయి. హిందువులందరిలాగే ఆయనకు కూడా తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి. ఒకరోజు స్వామిని దర్శించుకోవటానికి తిరుపతి వెళ్లారు. స్వామి వారిని దర్శించుకునే సమయంలో ఆలయ సిబ్బంది ఆయనకు ఇబ్బంది కలిగించారు.
స్వామిని తనివితీరా దర్శించుకోనివ్వకుండా పక్కకు నెట్టేశారు. దాంతో వెంటనే అక్కడి నుంచి ముకుంద పండా పలాసా వచ్చేశారు. తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
తల్లి ఇచ్చిన సూచనతో.. మహోన్నతమైన కార్యం..
తన స్వామిని కళ్లారా చూడలేకపోయానని మదనపడ్డారు. అదే విషయాన్ని తన తల్లికి చెప్పారు. వెంటనే తన తల్లి పలాసాలోనే అటువంటి ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. అదే తడవుగా ముకుంద పండా ఆలయ పనులు ప్రారంభించారు.
అందుకు పలాసా నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 12 ఎకరాలు భూమిని వాడారు. ఐదేళ్లలో ఆలయాన్ని నిర్మించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎలా ఉంటుందో అదే విధంగా కోట్ల రూపాయల ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
కొన్ని విషయాలు మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తాయో, అనుకున్నది సాధించేలా చేస్తాయో ముకుంద పండా ద్వారా అందరికి మరోసారి తెలిసింది. 97 ఏళ్ల వయసులో కూడా తానే గుడి పనులు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ముకుంద పండా ఒడిశా రాజ కుటుంబానికి చెందిన వారు. ఆయన తల్లి నిత్యం అమ్మవారి ఉపాసన చేస్తూ తమ ఇంటికి వచ్చిన వారికి దానధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరితోనూ మాట్లాడరు.
నిత్యం దైవ ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు హరిముకుంద పండా. ఆయనే పగలనక, రాత్రనక ఐదేళ్లు కష్టపడి ఎవరి దగ్గరా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా కొన్ని కోట్ల రూపాయలతో ఆలయ నిర్మాణాన్ని నిర్విరామంగా కొనసాగించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఏ ఇంజనీర్ సహాయం కూడా తీసుకోలేదు.
తన తల్లి విష్ణుప్రియ వాస్తు శాస్త్రంలో ప్రజ్ఞురాలు కావడంతో ఎక్కడ ఏ ఆలయ నిర్మాణం చేయాలి? ఏ విగ్రహం పెట్టాలి? శిల్పాలు ఏ విధంగా ఉండాలి? అనే వాటిలో తల్లి ఆదేశం ప్రకారం ముకుంద నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయంలో శిల్పకళకు ప్రాధాన్యం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జైపూర్ నుంచి అనేక ఏకశిల విగ్రహాలను తెప్పించి ప్రతిష్ఠించారు.
