ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. రజత్ భార్గవకు సిట్ నోటీసులు..
మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

AP liquor scam case
AP liquor scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలకు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొన్నారు.
Also Read: Avinash Reddy: జగన్ పర్యటనలో ప్రభుత్వం కుట్రలు చేసింది.. రైతులను అడ్డుకునేందుకు- ఎంపీ అవినాశ్ రెడ్డి
వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ పేరు వెలుగులోకి వచ్చింది. మద్యం పాలసీ రూపకల్పన నుంచి కమీషన్లు తీసుకోవడం వరకూ ఆయన అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడినట్లు సిట్ విచారణలో తేలింది. మద్యం మాఫియా విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడినా పట్టించుకోలేదని, లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి(ఏ-1) మొత్తం అబ్కారీ శాఖను శాసిస్తుంటే సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ కనీసం అభ్యంతరం చెప్పలేదని సిట్ భావిస్తుంది. దీంతో కొన్ని నెలల క్రితం పదవీ విరమణ చేసిన రజత్ భార్గవకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించారు.
లిక్కర్ పాలసీ రూపకల్పన ఎలా జరిగింది..? డిస్టిలరీస్ కూడా లేని వారికి మద్యం సరఫరా ఆర్డర్లు ఎలా ఇచ్చారు..? రాజ్ కసిరెడ్డి అబ్కారీ శాఖను శాసిస్తుంటే ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది..? ధరల నియంత్రణ లేకపోవడానికి కారణమేంటి..? కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంలో నిబంధనల ఉల్లంఘనను ఎందుకు పట్టించుకోలేదు..? ఏ కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా మొదటి నెలలో పదివేల బాక్సులకు మించి ఆర్డర్ ఇవ్వరాదన్న నిబంధనను అతనికి ఎందుకు వర్తింప చేయలేదు..? మొదటి నెలలోనే 1.80లక్షల కేసుల మద్యం ఆర్డర్లు ఇవ్వడం వెనుక గల కారణాలేంటి..? రిటైల్ అవుట్లెట్ల నుంచి పెట్టాల్సిన ఆర్డర్లు రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో సత్య ప్రసాద్ ద్వారా డిపో మేనేజర్లు పెడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు..? ఎవరి సిఫారసు మేరకు అనూషను ఎంఐఎస్ విభాగంలో నియమించారు..? అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కోసం స్పెషల్ మెమో ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది..? ఆమె సైఫ్ అహ్మద్ కు పంపితే రాజ్ కసిరెడ్డికి వివరాలు పంపి ముడుపులు సేకరించిన వైనం.. తదితర అంశాలపై రజత్ భార్గవపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించే అవకాశం ఉంది.
మద్యం ఉత్పత్తి, సరఫరాదారులు ఇచ్చిన ముడుపులు ఎవరెవరికి ఇచ్చారు..? ఎవరు ఎంత తీసుకున్నారు..? అనే విషయాలపైనా భార్గవ నుంచి సిట్ అధికారులు వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఆయన ఇచ్చే సమాధానాల తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.