ఏపీ ఎన్నికల్లో అసలు సిసలు హీరో పవన్ కల్యాణ్.. అలా అనుకున్నది సాధించిన జనసేనాని

అప్పుడెవరికీ జగన్‌ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని.

ఏపీ ఎన్నికల్లో అసలు సిసలు హీరో పవన్ కల్యాణ్.. అలా అనుకున్నది సాధించిన జనసేనాని

Pawan Kalyan : గాజు పగిలేకొద్దీ… పదునెక్కిద్ది… ఖచ్చితంగా గుర్తుపెట్టుకో… గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం… కనిపించని సైన్యం…. మూడు నెలల క్రితం ఓ సినిమా కోసం పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. టీడీపీ, జనసేన, బీజేపీ చారిత్రక విజయం వేళ అందరికీ ఈ డైలాగ్ గుర్తొస్తోంది. సరిగ్గా ఆ డైలాగ్‌లో చెప్పినట్టే… ఎదురుదెబ్బలు తగిలేకొద్దీ జనసేనాని రాటుదేలారు. మరింత శక్తిమంతంగా మారారు. తన వెనక ఓ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. పరాజయాలనే పరమపదసోపానంగా మార్చుకున్నారు. నేరుగా లక్ష్యానికి గురిపెట్టి… ఎక్కడా తొణకకుండా, తగ్గకుండా బాణాన్ని సంధించి అనుకున్నది సాధించారు. ముందుచూపు, సమయస్ఫూర్తితో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఓ అడుగు వెనక్కి వేసి… ఒక్క ఉదుటున ముందుకు దూకి వేటాడే సింహం తరహాలో ఎన్నికల కురుక్షేత్రాన్ని జయించారు.

లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పవన్ కల్యాణ్..
అది.. 151 సీట్ల మెజార్టీతో, ప్రభుత్వంపై పూర్తి పట్టుతో జగన్ తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న కాలం. గ్రామ సచివాలయాలు నిర్మించి పాలనను ప్రజలకు దగ్గర చేర్చడంతో పాటు వాలంటీర్లతో ఇంటింటికీ పెన్షన్ అందిస్తూ సంక్షేమ పాలకుడిగా జగన్ గుర్తింపు తెచ్చుకుంటున్న సమయం. అమ్మఒడి, చేయూత వంటి అనేక రకాల పథకాలతో ప్రజలను లబ్దిదారులుగా మార్చి.. అత్యంత ప్రజాకర్షక నేతగా జగన్ మారుతున్న పరిస్థితులు. ప్రాంతీయ పార్టీ నేతల్లో జగన్ దేశంలోనే శక్తిమంతమైన నాయకుడిగా ఉన్న రోజులు. అప్పుడెవరికీ జగన్‌ను అధికారానికి దూరం చేయగలమన్న ఊహ, నమ్మకం లేవు. అది జరగాలంటే సుదీర్ఘ శ్రమ కావాలని గ్రహించిన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. ఆ దిశగా పరిస్థితులను మార్చవచ్చని విశ్వసించిన వ్యక్తి జనసేనాని. మనసులో ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని… దానికి తగ్గ ప్రణాళికను తొలిసారి ప్రకటించారు పవన్. 2022లో జనసేన 9వ ఆవిర్భావ దినోత్సవం దీనికి వేదికైంది.

ఏపీ రాజకీయ పరిస్థితులను మలుపు తిప్పిన పవన్ సంచలన ప్రకటన..
ఏపీలో అప్పటి పరిస్థితులను ఎమర్జెన్సీ సమయానితో పోల్చిన పవన్ కల్యాణ్…. ఆంధ్రప్రదేశ్ బాధ్యత జనసేన తీసుకుంటుందని… ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనినవ్వబోనని…. దానికోసం దేనికైనా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులను మలుపు తిప్పిన ప్రకటన అది. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నప్పటికీ… 2019 నాటి పరిస్థితుల దృష్ట్యా జనసేన, టీడీపీ మధ్య అప్పటికి సానుకూల వాతావరణం లేదు. అయినా సరే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని.. ఎంతో ముందుచూపుతో పవన్ చేసిన ప్రకటన… టీడీపీ, జనసేన పొత్తు దిశగా అడుగులు వేయడానికి దారితీసింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చబోనని ప్రకటన..
పవన్ ఈ ప్రకటన చేసే నాటికి బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. బీజేపీ-వైసీపీ మధ్య అధికారిక బంధం లేనప్పటికీ.. జగన్‌కు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని అందరికీ తెలుసు. ఆ సమయంలో పవన్ చేసిన ప్రకటన ఓ రకమైన గందరగోళానికీ దారితీసిందని చెప్పాలి. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేతగా పవన్.. అదే బీజేపీతో స్నేహపూర్వక బంధంలో ఉన్న జగన్‌కు వ్యతిరేక ఓటును చీల్చబోనని ప్రకటించడంతో ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితి. అదే సమావేశంలో పవన్.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం గురించి మాట్లాడారు. కేంద్రం ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి త్యాగాలు చేసిన జనసేనాని..
అప్పటి నుంచి పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అదే ఈ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవడానికి దారితీసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బలిజ, ఒంటరి, మైనార్టీ కులాలను, ఇతర వర్గాల్లోని అభ్యుదయవాదులను కలుపుకుపోయి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ను సాధించడమే వచ్చే ఎన్నికల్లో జనసేన లక్ష్యమని.. కొద్ది నెలల తర్వాత పవన్ నేరుగా ప్రకటించారు. రాష్ట్రం కోసం త్యాగాలకు సిద్ధమవుతానని మొదటే చెప్పిన పవన్… తర్వాత రోజుల్లో ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు.

అంతిమ లక్ష్యం వైసీపీ ఓటమే..
టీడీపీ-బీజేపీ మధ్య ఏమాత్రం సుహృద్భావ వాతావరణం లేని రోజుల్లోనూ టీడీపీ-జనసేన-బీజేపీ కలయిక గురించి, 2014 నాటి పొత్తులను మళ్లీ ప్రారంభించడం గురించి జనసేనాని ఆలోచనలు చేశారు. బహిరంగంగా ఆ ఆలోచనలను పంచుకున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పటికప్పుడు మారతాయన్న పవన్… ఏం జరుగుతుందో.. ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్పలేనని… కానీ…..అంతిమ లక్ష్యం మాత్రం వైసీపీని ఓడించడమేనని చెప్పడం ద్వారా ..జనసేన అసలు లక్ష్యమేమిటో… అది సాధించడానికి ఏం చేయాలో.. తనకు తెలుసుని అందరికీ తెలియచెప్పారు.

Also Read : జగన్ ఘోర ఓటమికి, చంద్రబాబు ఘన విజయానికి ప్రధాన కారణాలివే- మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

కలిసి పోటీ చేయడంపై పరోక్ష సంకేతాలు..
వైసీపీని ఓడించడమే లక్ష్యమని 2022 ప్రారంభంలోనే పవన్ చెప్పినప్పటికీ.. జనసేన, టీడీపీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డ పరిస్థితులు చాలా కాలం కనిపించ లేదు. ఇక టీడీపీ-బీజేపీ మధ్య అయితే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితే. ఇక మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం అన్నది రెండేళ్ల క్రితం ఎవరి ఊహకూ అందని విషయం. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ విషయాన్ని నమ్మారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కొన్ని త్యాగాలు చేయడానికి తాను సిద్ధమని, అలాగే త్యాగాలకు సిద్ధంగా ఉన్న పార్టీలతో పొత్తుకు సుముఖంగా ఉంటానని చెప్పడం ద్వారా కలిసి పోటీచేయడంపై పరోక్ష సంకేతాలు పంపారు. ఆ తర్వాత చంద్రబాబుతో, ఢిల్లీ పెద్దలతో వరుస సమావేశాలతో రాయబారాలు సాగించారు. అయినప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అనుకున్నంత వేగంగా, తేలికగా పొత్తు కుదరలేదు. విస్తృత సంప్రదింపులు, సమగ్ర చర్చల తర్వాతే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చింది.

టీడీపీతో పొత్తు దిశగా అడుగులు..
2019 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన తర్వాత చంద్రబాబు, పవన్ తొలిసారి సమావేశమైంది 2022 అక్టోబర్ 18న. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అప్పటికే పవన్ ప్రకటించి కొన్ని నెలలయింది. విశాఖలో పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆయనకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు విజయవాడ వెళ్లి… హోటల్‌లో సమావేశమయ్యారు. ఆ సమావేశంతో టీడీపీ-జనసేన పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయని అందరికీ అర్ధమయింది. ఈ సమావేశం జరిగిన 3 నెలలకు చంద్రబాబు-పవన్ మధ్య రెండో సమావేశం జరిగింది.

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం..
కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు పవన్. 2023 జనవరి 8న జరిగిన ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని, రాజకీయంగా పొత్తు పెట్టుకునే పరిస్థితులను సృష్టించుకోవాలని నిర్ణయించారు. ఆ తర్వాత మరో మూడు నెలలకు చంద్రబాబు నివాసంలో మరోసారి ఇద్దరు నాయకుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముందు పవన్ ఢిల్లీ వెళ్లిరావడంతో పొత్తు గురించి చర్చించేందుకే చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారన్న ప్రచారం సాగింది. టీడీపీ, జనసేన పొత్తు ఖరారయినట్టేనన్న అభిప్రాయం అంతటా నెలకొంది. కానీ ఆ సమయంలో కానీ, ఆ తర్వాత కొన్ని నెలల పాటు గురించి పొత్తు గురించి అటు చంద్రబాబు కానీ, ఇటు పవన్ కానీ.. ఇద్దరు నాయకులు గానీ మాట్లాడలేదు.

ఏపీ ముఖచిత్రాన్ని మార్చివేసిన పవన్ పొత్తు ప్రకటన..
ఆ సమయంలో వారాహి యాత్రలతో పవన్ జనంలో విస్తృతంగా తిరిగారు. వైసీపీకి వ్యతిరేకంగా భారీ ప్రచారం జరిపారు. టీడీపీ సొంత కార్యక్రమాలు నిర్వహించుకుంది. బీజేపీ జనసేనను మాత్రమే మిత్రపక్షంగా భావిస్తోంది. అలాంటి తరుణంలోనే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును పరామర్శించిన పవన్….జైలు బయటికొచ్చి…టీడీపీతో పొత్తుపై చేసిన అనూహ్య ప్రకటన….ఏపీ ముఖచిత్రాన్ని మార్చివేసింది. టీడీపీ, బీజేపీ మధ్య సంబంధాలు అస్పష్టంగా ఉన్న ఆ పరిస్థితుల్లో…బీజేపీ కూడా పొత్తులో ఉంటుందని చెప్పడం పవన్ ముందుచూపుకు, పట్టుదలకు నిదర్శనం.

పొత్తుకు ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత..
పొత్తు ప్రకటన తర్వాత టీడీపీ, జనసేన శ్రేణులు ఐకమత్యంతో ముందుకు సాగాయి. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు టీడీపీ కార్యకర్తలతో సమానంగా…జనసేన కార్యకర్తలు టీడీపీ అధినేతకు స్వాగతం పలికేందుకు తరలివచ్చారు. జైలు నుంచి చంద్రబాబు ఇంటికి వెళ్లే సమయంలో దారిపొడుగునా టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి. ఆ తర్వాత పరిణామాలు చకచకా మారిపోయాయి. చంద్రబాబు జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై చర్చలు జరిగాయి. ఆ సమయంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు ఢిల్లీ పెద్దలను ఒప్పించే బాధ్యత భుజాన వేసుకున్నారు. బీజేపీతో పొత్తు ఖరారు కాకముందే…టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు జరిగింది.

కాపు నేతల ఆరోపణలకు ఘనవిజయంతో జనసేనాని జవాబు..
175 స్థానాల్లో 40 నుంచి 50 సీట్లు జనసేన డిమాండ్ చేయాలని సలహాలిచ్చే హరిరామజోగయ్యలాంటి నేతలు, సొంతంగా పోటీ చేద్దామనే కొందరు జనసైనికుల ఒత్తిళ్ల మధ్య కూడా జనసేనాని అత్యంత చాకచక్యంగా, తెలివిగా వ్యవహరించారు. జనసేన అసలు బలమేంటి.. బలహీనతలేంటి..ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఏమవుతుంది అని మద్దతుదారులకు నచ్చజెప్పి ఒప్పించారు. టీడీపీలా మనకు సంస్థాగత బలముందా..? వైసీపీలాగా అవినీతి సంపాదనుందా..? అని గట్టిగా ప్రశ్నించి.. విమర్శకుల నోళ్ల మూయించారు. హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి కాపు నేతలు చేసిన ఆరోపణలకు ఎన్నికల్లో విజయంతోనే జనసేనాని జవాబు చెప్పారు.

రాజకీయ సమీకరణాలు, పొత్తుల లెక్కలపై పవన్‌కు పరిపూర్ణ స్పష్టత..
టీడీపీతో పొత్తు విషయంలోనే కాదు….. బీజేపీతో కలిసి నడవడంపైనా ఆయనకు స్పష్టమైన లెక్కలున్నాయి. రాజకీయ సమీకరణాలు, పొత్తుల లెక్కలపై పవన్‌కు పరిపూర్ణ స్పష్టత ఉంది. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఓడిపోయిన కొన్ని నెలలకే ఆయన బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరిచింది. ఢిల్లీ వెళ్లిన పవన్ 2020 జనవరిలో బీజేపీతో పొత్తుపై ప్రకటన చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు టీడీపీతో కలిసి పోటీ చేయడంపై ఆలోచనలు ప్రకటించారు. జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒకటే లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం ఎలా ఉంటుందో రుజువుచేశారు.