కృష్ణా జిల్లాలో కిడ్నీ మహమ్మారి.. మృత్యువుతో పోరాడుతున్న బాధితులు

Kidney epidemic in Krishna : బతికినంత కాలం ఆ రోగం వాళ్లకు నరకం చూపిస్తోంది. ఏమైందో ఏమో… ఎవరికీ తెలియదు. ఏమైందని అడిగితే మాత్రం కిడ్నీలు పాడయ్యాయంటారు. కారణం ఏమిటీ అంటే ఒకటే సమాధానం… అదే తెలియదు…. ఈ జబ్బుకు వయసుతో పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ వ్యాధి బాధితులే. కొంత మంది చిన్న వయసులోనే కాలం చేస్తుంటే… మరి కొందరు చావు కోసం ఎదురుచూస్తున్నారు.
కృష్ణా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇది. జిల్లాలోని 13 మండలాలను కిడ్నీ మహమ్మారి చాప కింద నీరులా చుట్టేసింది. జనం ప్రాణాలను బలికోరుతోంది. తిరువూరు, ఎ.కొండూరు, గంపలగూడెం, విస్సన్నపేట, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, ఆగిరిపల్లి, మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, నందిగామ, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలను కిడ్నీ వ్యాధి వణికిస్తోంది.
ఒక్క నాగమ్మే కాదు… ఇక్కడి తాండాల్లో నాగమ్మ లాంటి రోగులు చాలామందే ఉన్నారు. కొందరికి రెండు కిడ్నీలు పాడయ్యాయి. మరికొందరు ఒక కిడ్నీతోనే బతుకు వెళ్లదీస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు చచ్చిపోయారు. కొన్ని ఇళ్లల్లో అమ్మా, నాన్న చనిపోయి పిల్లలు అనాథలయ్యారు. మరికొన్ని ఇళ్లల్లో చేతికి అందివచ్చిన కొడుకులు అర్థాంతరంగా మరణించారు. తల్లిదండ్రులకు బతుకు భారంగా మిగిల్చారు.
కొందరికి ప్రభుత్వ సాయం అరకొరగా దొరుకుతోంది. చాలా మందికి అది అందని ద్రాక్షే. నిరక్షరాస్యత వల్ల వాళ్లు ప్రభుత్వ సాయం కూడా పొందలేకపోతున్నారు. కొన్ని చోట్ల ఆశా వర్కర్లు కొంత సాయం చేస్తున్నారు. ఏ తాండాలోకి వెళ్లినా ఇవే కథలు. కన్నీటి గాథలు. ఏ ఇంటిని పలకరించినా ఇదే వ్యధ. ఏ గడప తొక్కినా చావుకబురే.. కడుపు తరుక్కుపోయే విషాదాలు. ఒక్కటి కాదు.. రెండు కాదు.. 300 గ్రామాల్లో ఇవే దృశ్యాలు. గుండెలను పిండేసే ఆర్తనాథాలు.
ఇంతకీ ఈ కిడ్నీ రోగాలకు కారణం ఏంటి…? పచ్చని గ్రామాలను కిడ్నీ వ్యాధి ఎందుకు కాటేస్తోంది అంటే కారణం నీళ్లు… అవును ప్రాణం నిలబెట్టే జీవజలం ఇక్కడ విషంగా మారింది. నీళ్లలోని ఫ్లోరైడ్ వీళ్ళ ప్రాణాలు తోడేస్తోంది. ప్లోరైడ్ నీటిని తాగడంతో కిడ్నీలు పాడవుతున్నాయి. రక్షిత నీరు అందుబాటులో లేకపోవడంతో వ్యాధి ప్రబలింది. ముందుగా ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పితో మొదలవుతోంది. ఏదో చిన్న సమస్యలే అనుకుంటారు. కానీ తేరుకునేలోగానే అంతా అయిపోతుంది. కిడ్నీలు పనికిరాకుండా పోతాయి.
ఇక్కడున్న చిన్న వైద్యులు హెవీ డోస్ యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్లు ఎక్కువగా ఇస్తున్నారు. అవన్నీ కిడ్నీలపై మరింత ప్రభావం చూపుతున్నాయి. కొద్ది రోజుల్లోనే కిడ్నీలు పాడవుతున్నాయి. తీరా కిడ్నీలు పాడయ్యాక వీళ్ళు విజయవాడ, గుంటూరు వెళ్లి పెద్ద డాక్టర్లకు చూపిస్తున్నారు.
తమకు కిడ్నీ రోగం ఉందని తెలిసే సరికే కొందరికి ప్రాణం మీదికొస్తోంది. కూలి పనులకు వెళ్లలేక చాలా మంది ఇంట్లోనే కూలబడుతున్నారు. మరో విచిత్రం ఏమంటే నిరక్షరాస్యత వీరిని మరో రోగంగా వెంటాడుతోంది. డయాలసిస్ కు వెళితే చనిపోతామన్న భయం చాలా మంది రోగుల్లో కనిపిస్తోంది. మందులు వాడాలన్నా.. డయాలసిస్ కు వెళ్లాలన్నా మరికొందరి వద్ద డబ్బు లేదు. పేదరికం వాళ్ళను చావు వైపు తీసుకు పోతోంది.