Strange Thief : స్మశానంలోనే ఉంటూ, స్మశానంలోనే తింటూ చోరీలు.. కృష్ణా జిల్లా పోలీసులకు చిక్కిన వింతైన ఘరానా దొంగ
స్మశానంలోనే ఉంటాడు, స్మశానంలోనే తింటాడు.. సెల్ ఫోన్ వాడడు. కానీ, తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. కృష్ణా జిల్లా పోలీసులకు వింతైన ఘరానా దొంగ దొరికాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, సెన్సార్లకు దొరక్కుండా చోరీలు చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Strange Thief : స్మశానంలోనే ఉంటాడు, స్మశానంలోనే తింటాడు.. సెల్ ఫోన్ వాడడు. కానీ, తెలివిగా దొంగతనాలు చేస్తుంటాడు. కృష్ణా జిల్లా పోలీసులకు వింతైన ఘరానా దొంగ దొరికాడు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, సెన్సార్లకు దొరక్కుండా చోరీలు చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్ననాటి నుంచి అనాథగా పెరిగిన తిరువీధుల సురేంద్ర అనే 28ఏళ్ల యువకుడు దొంగతనాలనే ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఎవరి సాయం లేకుండా ఒక్కడే చోరీలు చేసేస్తూ లక్షల విలువ చేసే సొత్తును కొల్లగొట్టాడు. ఏ ఊరిలో చోరీ చేస్తే ఆ ఊరిలో స్మశానాలకు చేరి అక్కడే పడుకుంటాడు. చోరీ చేసిన సొత్తును కూడా అక్కడే పాతిపెట్టి మరో దొంగతనం చేస్తాడని చెప్పారు పోలీసులు.
గతంలో సురేంద్రపై వరంగల్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారని, ఆగస్టు 17న జైలు నుంచి రిలీజ్ అయ్యి మళ్లీ ఏడు దొంగతనాలు చేశాడని పోలీసులు వెల్లడించారు. సురేంద్ర చోరీ చేయాలనుకుంటే ముందుగా ఒక బైక్ ను దొంగిలిస్తాడు. ఆ బైక్ పైనే తిరుగుతూ రెక్కీ చేస్తాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో చోరీలు చేస్తాడని పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలు, సెన్సార్లకు దొరక్కుండా పక్కాగా పని కానిచ్చేస్తాడని పోలీసులు చెప్పారు. దొంగిలించిన సొత్తు ఎంతైనా.. స్మశానంలోనే దాచేసి మరో ప్రాంతానికి వెళ్తాడని అన్నారు. తెలంగాణ, ఏపీలో కలిసి సురేంద్రపై 121 చోరీ కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. నిందితుడి నుంచి 34 తులాల బంగారం, 3 కేజీల వెండి, బైక్ రికవరీ చేశారు పోలీసులు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు కూడా అందజేశారు.