లేడీ డాక్టర్ మిస్టరీ డెత్ : డ్యూటీకి వెళ్లి కాలువలో శవమై తేలిన డాక్టర్ శ్యామల

  • Published By: nagamani ,Published On : August 6, 2020 / 04:31 PM IST
లేడీ డాక్టర్ మిస్టరీ డెత్ : డ్యూటీకి వెళ్లి కాలువలో శవమై  తేలిన డాక్టర్ శ్యామల

Updated On : October 31, 2020 / 4:28 PM IST

డ్యూటీకి బయల్దేరిన లేడీ డాక్టర్ కాల్వలో శవమై తేలిన విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలో తీవ్ర సంచలనానికి దారి తీసింది. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం పీహెచ్‌సీ డాక్టర్ గా పనిచేస్తున్న మళ్ల శ్యామల(34) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కశింకోట మండలంలోని తాళ్లపాలెం వద్ద ఏలేరు కాల్వలో శవమై తేలారు. తాను హాస్పిటల్ కు వస్తున్నానని ఇంటినుంచి బయలుదేరే సమయంలో చెప్పిన డాక్టర్ శ్యామల ఏలేరు కాల్వలో శవమై కనిపించడం మిస్టరీగా మారింది.




డాక్టర్ శ్యామల విశాఖలోని గాజువాక డిపో ఏరియాలో నివాసముంటున్నారు. ఆమె భర్త విజయవాడలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆమెకు ఐదేళ్ల బాబు, రెండేళ్ల పాప ఉన్నారు.ఇటీవల తాను పనిచేసే హాస్పిటల్ లో ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణి మృతి చెందటంతో డాక్టర్ శ్యామల తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆమె రెండురోజులు సెలవు పెట్టారు. అనంతరం ఆగస్టు 4న డ్యూటీకి ఇంటినుంచి 7.30 గంటకు బయలుదేరారు. అలా బయలుదేరిన శ్యామల 10 గంటలకు కశింకోట మండలం తాళ్లపాలె దగ్గర ఏలేరు కాల్వలో శవమై కనిపించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్ల సహాయంతో శ్యామల మృతదేహాన్ని వెలికి తీసారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం తరలించారు.



సెలవులో ఉన్న శ్యామల ఉదయం ఏడు గంటల సమయంలో పీహెచ్‌సీ సిబ్బందికి ఫోన్ చేసి విధులకు హాజరవుతున్నట్లు చెప్పారని.. అనంతరం పది గంటల నుంచి ఆమె ఫోన్ పనిచేయలేదని సిబ్బంది చెబుతున్నారు. మధ్యాహ్నం ఆమె మృతదేహం కాల్వలో కనిపించింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? లేక హత్య చేసి పడేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. చాలా ధైర్యవంతురాలని సిబ్బంది చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా హాస్పిటల్ లో గర్భిణి మృతి చెందిన బంధువులు శ్యామలను హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అదే విషయాన్ని పోలీసులకు తెలిపారు.
డాక్టర్ శ్యామల అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమెది హత్యా? ఆత్మహత్యా..అనేకోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.