తిరుపతి అలిపిరిలో చిరుత కలకలం.. బైక్‌పై వెళ్తున్న వారిపై దాడికి యత్నం.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్
వీడియోలో.. పొదల్లో పొంచిఉన్న చిరుతపులి బైక్ పై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడికి యత్నించింది.

Leapord Attack
Leapord Attack: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైఉన్న తిరుమలలో చిరుత పులి మరోసారి కలకలం సృష్టించింది. అలిపిరి ఎస్వీ జూపార్క్ రోడ్డులో శుక్రవారం రాత్రి బైక్ పై వెళ్తున్న ప్రయాణికులపై చిరుత ఒక్కసారిగా దాడికి యత్నించింది. చిరుత దాడినుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
వీడియోలో.. పొదల్లో పొంచిఉన్న చిరుతపులి బైక్‌పై వెళ్తున్న వారిపై ఒక్కసారిగా దాడికి యత్నించింది. అయితే, బైక్ స్పీడ్‌గా వెళ్తుండటం వల్ల పులి పంజా నుంచి బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో చిరుతపులి బైక్‌ను స్వల్పంగా ఢీకొని కింద పడిపోయింది. క్షణాల్లో తేరుకొని పొదల్లోకి వెళ్లిపోయింది. వెనుకాల కారులో వెళ్తున్న వ్యక్తులు ఈ దృశ్యాలను సెల్ ఫోన్లో బంధించారు.
ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో చిరుత పులుల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది చిరుత పులులను బంధించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. గత రెండేళ్లుగా చిరుత పులుల దాడిలో పలువురు భక్తులు గాయపడ్డారు. ఓ చిన్నారి చిరుత దాడిలో ప్రాణాలుసైతం కోల్పోయింది.
అలిపిరి, ఎస్వీ జూ పార్క్ రోడ్డు సమీపంలో ఇటీవల చిరుత పులుల సంచారం ఎక్కువగా ఉంది. శుక్రవారం రాత్రి ఎస్వీ జూపార్క్ రోడ్డులో చిరుత దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో తిరుమల అధికారులు వెంటనే స్పందించి.. రాత్రి సమయంలో తిరుమల ఘాట్ రోడ్డుపైకి ద్విచక్ర వాహనాల అనుమతిని నిలిపివేశారు.
ఇదిలాఉంటే.. తిరుమలలో తాజాగా భక్తుల రద్దీ పెరిగింది. మొత్తం 73,576 మంది భక్తులు స్వామి వారి దర్శనం పొందారు. ఈ సందర్భంగా 25,227 మంది భక్తులు మొక్కులు తీర్చుకొనేందుకు తలనీలాలు సమర్పించారు. ఆలయ హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 4.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.