లాక్ డౌన్ 2.0 : సీఎం కేసీఆర్ అలా..సీఎం జగన్ ఇలా

  • Published By: madhu ,Published On : April 11, 2020 / 12:48 PM IST
లాక్ డౌన్ 2.0 : సీఎం కేసీఆర్ అలా..సీఎం జగన్ ఇలా

Updated On : April 11, 2020 / 12:48 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వీడడం లేదు. లక్ష మంది దాక చనిపోతున్నారు. భారతదేశంపై కూడా ఈ రాకాసి కమ్మేసింది. 200 మంది దాక చనిపోయారు. దీంతో ఎన్నో దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించింది. ఈ గడువు 2020, ఏప్రిల్ 14వ తేదీతో ముగుస్తోంది. ఈ క్రమంలో దేశంలో నెలకొన్న పరిస్థితులు తెలుసుకొనేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం రెండోసారి ముచ్చటించారు. (వీడియో కాన్ఫరెన్స్)

ఈ సందర్భంగా వారి వారి అభిప్రాయాలు వెల్లడించారు. కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెల్లడించిన అభిప్రాయాలు హాట్ టాపిక్ గా మారాయి. రెడ్ జోన్ల వరకే లాక్ డౌన్ పరిమితం చేయాలని ఏపీ సీఎం జగన్ చెప్పగా..లాక్ డౌన్ రెండు వారాల పాటు కొనసాగించాలని సీఎం కేసీఆర్ చెప్పడం విశేషం. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు లాక్ డౌన్ బాగా ఉపయోగపడుతుందని మెజార్టీ సీఎంలు అభిప్రాయాలు చెప్పారు. 

ఏపీ రాష్ట్ర విషయానికి వస్తే..ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం రోజున 24 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 405 మంది చేరుకున్నట్లైంది. 12 మంది దాక చనిపోయారు. రాష్ట్రంలో 133 రెడ్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో గరిష్టంగా నెల్లూరు జిల్లాలో 30 ప్రాంతాలు ఉండడం గమనార్హం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం.

కానీ..ప్రధాన మంత్రితో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో రెడ్ జోన్ల వరకు మాత్రమే లాక్ డౌన్ విధించాలని చెప్పడం గమనార్హం. 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని చెప్పారు. రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడం కూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యిందని చెప్పిన ఆయన..ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది తన అభిప్రాయన్నారు. జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనా మందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితే కొనసాగించడం..ఇవి కాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలని సీఎం జగన్ సూచించారు. 

ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే…కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. లాక్ డౌన్ ను కచ్చితంగా అమలు చేయాలని, దీనికి ప్రజలు సహకరించాలని సూచించారు. గతంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్ డౌన్ పై స్పష్టంగా స్పందించారు. లాక్ డౌన్ కొనసాగించాలని, ప్రధానితో ఇదే విషయం చెబుతానని కుండబద్ధలు కొట్టారు. లాక్ డౌన్ కొనసాగించకపోతే..ఇప్పటిదాక చేసిన కృషి అంతా ఫెయిల్ అవుతుందన్నారు.

ఆర్థికంగా సమస్యలున్నా..రానున్న రోజుల్లో తీర్చుకోవచ్చని..కానీ ప్రాణం పోతే తీసుకరాలేమన్నారు. తాజాగా శనివారం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో అనుకున్నట్లుగానే స్పందించారు. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీని కోరారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ బాగా ఉపయోగపడుతోందన్నారు. అందువల్ల దీన్ని కనీసం మరో రెండు వారాలు కొనసాగించడం మంచిదని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భిన్నంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు స్పందించడం సర్వత్రా చర్చనీయాంశమైంది.