సజ్జల భార్గవ్ రెడ్డికి బిగ్ షాక్..! లుకౌట్ నోటీసులు జారీ..
పులివెందులలో నమోదైన కేసు ఆధారంగా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు.

Sajjala Bhargava Reddy : సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కడప పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8న పులివెందులలో వర్రా రవీంద్రారెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఏపీలో భార్గవ్ రెడ్డిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో విదేశాలకు పారిపోతారనే అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వీరిద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
వైసీపీ సోషల్ మీడియాలో కీలకమైన వ్యక్తి సజ్జల భార్గవ్ రెడ్డి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపులు చేపట్టారు. సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి.. ఈ ఇద్దరికి లుకౌట్ నోటీసులు పంపారు. దాదాపు వారం రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరిపైన నిఘా పెట్టిన పోలీసులు.. ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చెందిన వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. సజ్జల భార్గవ్ ఆదేశాలతోనే తాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టానని రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. దీని ఆధారంగా పోలీసులు భార్గవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు గుంటూరు నుంచి ముందస్తు బెయిల్ కోరారు సజ్జల భార్గవ్. దీంతో అతడికి లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది. తనకున్న నెట్ వర్క్ ఆధారంగా సజ్జల భార్గవ్ విదేశాలు వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించిన పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. వర్రా రవీంద్రారెడ్డిని అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల పెట్టే విషయంలో కీలక పాత్ర పోషించిన సజ్జల భార్గవ్, అర్జున్ రెడ్డిలను.. పులివెందులలో నమోదైన కేసు ఆధారంగా వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వారందరిని పోలీసులు టార్గెట్ చేశారు. వారిని అరెస్ట్ చేసే పర్వం కంటిన్యూ అవుతోంది.
Also Read : ఏపీలో రిలయన్స్ 65 వేల కోట్ల రూపాయల పెట్టుబడి.. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోనే..